చురుగ్గా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుమల: వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుమలలో ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా వాహన సేవల ఊరేగింపు ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బారికేడ్ల నిర్మాణం సాగుతోంది. గరుడ సేవలో సుమారు 3 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బారికేడ్లు నిర్మిస్తున్నారు. తూర్పుమాడ వీధిలో కొంతభాగం, దక్షిణ, ఉత్తరమాడ వీధుల్లో పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంతోపాటు మంటపాలకు వెల్లవేసే పనులు కూడా సాగుతున్నాయి.
పురవీధుల్లో ఊరేగించే వాహనాలకు మరమ్మతులు పూర్తి చేశారు. వాహనాలు హారతులు అందుకునే ప్రాంతాల్లో చలువ పందిళ్లు నిర్మిం చారు. ఇప్పటికే శ్రీవారి పుష్కరిణి నీటిని తొల గించారు. ఈ నెలాఖరుకు పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యుత్ దీపాలతో దేవతా ప్రతిమలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఏర్పాట్లన్నీ ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి.
తిరుమలలో కుండపోత వర్షం
తిరుమలలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆలయ పరిసరాల్లో వాన నీరు నిలిచింది. తిరుమల రెండు ఘాట్‌రోడ్లలోని జలపాతాల్లో నీటి ప్రవాహం కనిపించింది. తిరుమల సమీపంలోని రెండో మలుపు వద్ద భారీ కొండచరియ విరిగిపడింది. చివరి నాలుగు మలుపుల్లోనూ కొండచరియలు కూలేలా ఉన్నాయి. వీటిపై టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రోడ్డుపై పడిన బండరాళ్లను ఎప్పటికప్పుడు తొలగించే పని చేపట్టారు.