‘ఓటు’ దాటాక..!
- పంట రుణాల మాఫీపై బాబు రోజుకో మెలిక
- 33 మండలాల్లోనే పంట రుణాల రీషెడ్యూలు
- ఒక కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ
- పంట రుణాల మాఫీలో అలసత్వంపై రైతుల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఓటు దాటాక హామీలను తగలెయ్యడం అంటే ఇదే..! ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఒక్క సంతకంతో పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. ఆ హామీతోనే టీడీపీ గద్దెనెక్కింది. కానీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తక్షణమే ఆ హామీకి నీరుగార్చేందుకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పంట రుణాల మాఫీపై బాబు రోజుకో మాట మాట్లాడటమే అందుకు తార్కాణం.
జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా బంగారు నగలను తనఖా పెట్టి 4,53,162 మంది రైతులు రూ.3,486.50 కోట్లు రుణంగా తీసుకున్నారు. 68,761 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల రూపంలో రూ.1,129.75 కోట్లు అప్పుగా పొందారు. 45,780 మంది రైతులు వ్యవసాయ పరోక్ష రుణాల రూపంలో రూ.753.16 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
మొత్తమ్మీద బ్యాంకర్లకు రూ.11,180.25 కోట్లను పంట రుణాల రూపంలో రైతులు బకాయిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఒక్క సంతకంతో తమ రుణాలను మాఫీ చేస్తారనుకున్న రైతుల ఆశలను అడియాశలు చేశారు. పంట రుణాల మాఫీకి తొలి సంతకం చేస్తారని భావిస్తే.. విధి విధానాల రూపకల్పనకు కోటయ్య నేతృత్వంలో కమిటీని నియమిస్తూ సంతకం చేయడం రైతులను నిరాశకు గురిచేసింది. కోటయ్య కమిటీ 45 రోజుల్లోగా నివేదిక ఇస్తుంది.. ఆ నివేదిక ఆధారంగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ.. ఇప్పటికీ కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
కరవు మండలాల్లోనే రీషెడ్యూలు..
రుణాలను రీషెడ్యూలు చేయించి.. కొత్తగా పంట రుణాలు ఇచ్చేలా చూస్తామని.. రీషెడ్యూలు చేసిన రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని.. ఇందుకు ఆర్‌బీఐ అనుమతి కోసం లేఖ రాశామని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. కరవు ప్రభావిత మండలాల్లో అదీ 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలనే రీషెడ్యూలు చేస్తామని, ఆ రుణాలను కూడా మూడేళ్లలోగా చెల్లించాల్సిందేనని మంగళవారం ప్రభుత్వానికి ఆర్‌బీఐ మార్గదర్శకాలు పంపింది.
ఈ నిబంధనకు అంగీకరిస్తే రుణాల రీషెడ్యూలు చేస్తామని ప్రకటించింది. మన జిల్లాలో 66 మండలాలకుగానూ ప్రభుత్వం 33 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు రూ.1,438 కోట్లను పంట రుణాలుగా పొందారు. అంటే.. ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాలకు ప్రభుత్వం అంగీకరిస్తే కేవలం 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల పంట రుణాలు మాత్రమే రీషెడ్యూలు చేస్తారన్న మాట.
కరవు, తుఫాను వంటివి సంభవించి, పంటలు నష్టపోయినప్పుడు రుణాలను రీషెడ్యూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ ఆనవాయితీలో భాగంగానే ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసింది తప్ప.. చంద్రబాబు కృషి ఏమీ లేదన్నది స్పష్టమవుతోంది. ఆర్‌బీఐ నిబంధనలకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్కిన 7.50 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్ల మాటేమిటన్న అంశంపై స్పష్టత లేదు. అదునులో వర్షాలు పడినా పెట్టుబడులకు డబ్బుల్లేక పంటలను సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాల మాఫీలో ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై రైతన్నలు మండిపడుతున్నారు.