
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన దర్యాప్తును అడ్డుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) బొప్పుడి కృష్ణమోహన్ హైకోర్టుకు నివేదించారు. అందుకే న్యాయస్థానం ఆదేశించినా కూడా ఎన్‌ఐఏకు రికార్డులివ్వకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. పైగా తమను రికార్డులివ్వాలని కోరుతున్నారని.. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించగానే ఆ కేసుకు సంబంధించిన రికార్డులివ్వాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కాగా, రికార్డులన్నింటినీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించే విషయంలో తమ ప్రయోజనాలను పరిరక్షించాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అభ్యర్థించింది. దీనికి హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. అయితే ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా వాదనలు వాడిగా వేడిగా సాగాయి. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఎన్‌ఐఏను దర్యాప్తు చేయాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేశామని, అంతేకాక రికార్డులను ఎన్‌ఐఏకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బొప్పుడి కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ, ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం ఎన్‌ఐఏ దర్యాప్తునకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉందని వివరించారు. ఎన్‌ఐఏకు దర్యాప్తు అప్పగించాలన్నది కేంద్రం స్వీయ నిర్ణయం కాదని, హైకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమన్నారు.
వాడీ వేడిగా వాదనలు..
ఏజీ స్పందిస్తూ, తాము దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరడం లేదని, తమ ప్రయోజనాలను పరిరక్షించాలని మాత్రమే తాము కోరుతున్నామని చెప్పారు. ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఎందుకు ఆదేశిస్తున్నారో కారణాలు చెప్పలేదని, కేవలం ఘటన తీవ్రత దృష్ట్యా అని మాత్రమే కేంద్ర హోంశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొందని వివరించారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన రికార్డులను సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశించినా ఎన్‌ఐఏకు రికార్డులు ఇవ్వకుండా, తమను రికార్డులివ్వాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. దర్యాప్తును అడ్డుకోవడానికే ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు.
ఈ సమయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, తాము కేవియట్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా ప్రభుత్వం తమకు నోటీసు ఇవ్వకుండానే పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఏజీ స్పందిస్తూ, తమ పిటిషన్‌తో వారికి ఏం సంబంధం లేదని, ఈ వ్యవహారంలో ఆళ్ల థర్డ్ పార్టీ అని చెప్పారు. దీనికి సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే పిల్ దాఖలు చేసినపుడు తమకు సంబంధం లేకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య వివాదమని, అధికరణ 131 ప్రకారం కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అనంతరం న్యాయమూర్తి, కేవియట్ కేసుల విచారణ జాబితాలో లేదని, అందువల్ల దాన్ని జాబితాలోకి వచ్చేలా చూసుకోవాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment