
పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
దొడ్డిదారిన వర్గీకరణకు ప్రయత్నాలు జీవో 25ను రద్దు చేయాలి
పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్
గాంధీనగర్ : దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్ దుయ్యబట్టారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసేందుకే జీవో 25 జారీ చేశారన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ‘మాలల పంతం-చంద్రబాబు అంతం’ నినాదంతో వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. జీవో 25ను రద్దు చేయకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. వర్గీకరణ ఏ రూపంలో చేపట్టినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఏకపక్షంగా వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుకు మళ్లీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ రంగంలో నియామకాలు నిలిచిపోయినందున ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను పీవీరావు మాలమహానాడు ఖండించింది. తమకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే అసలు రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదన్నారు. గుజరాత్ ఉద్యమం పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ అండదండలతో నడుస్తోందన్నారు. పీవీరావు ఆశయ సాధనకోసమే ‘పీవీరావు మాలమహానాడు’ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ సభ్యులు పళ్లం ప్రసాద్, పి.పరశురాముడు, కె.లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ యర్ర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.