ఓ మహిళ స్కూల్లో ఉన్న తన పిల్లలకు క్యారియర్ అందించి వస్తోంది..
ఇంతలో ఓ ద్విచక్ర వాహనం రయ్..మని ఆమె పక్కకు దూసుకొచ్చింది.
వాహనంపై ఉన్న ఆగంతకుడు ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొనేందుకు యత్నించాడు.
అప్రమత్తమైన ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది..
ఆగంతకుడు రెచ్చిపోయాడు..
పిస్తోలు తీసి టప టపా కాల్పులు జరిపాడు.
రెండు బుల్లెట్లు ఆమె ఎడమ కాలిలోకి దూసుకుపోయాయి..
టెక్కలి : హఠాత్తుగా వినిపించిన కాల్పుల శబ్ధం.. ఆ వెంటనే భయంతో మహిళ పెట్టిన కేకలు.. స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. ఏం జరిగిందోనన్న భయంతో ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. జనాన్ని చూసిన ఆగంతకుడు తుపాకీతో వారిని బెదిరిస్తూ పారిపోయాడు. ఈ సంఘటన టెక్కలిలో భయానక వాతావరణం సృష్టించింది. పోలీస్ స్టేషనుకు కూతవేటు దూరంలోనే ఉన్న వెంకటేశ్వర కాలనీలో జరిగిన ఈ ఘటనలో బాధితురాలు తంగుడు స్వప్న అపస్మారక స్థితిలోకి చేరడంతో వెంటనే ఆమెను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న ఆనంతరం ఆమె సంఘటన వివరాలు వెల్లడించింది.
ఎప్పటిలాగే తన పాఠశాలకు వెళ్లి పిల్లలకు భోజనం పెట్టి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగుడు తన మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి ప్రయత్నించగా తాను ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడని చెప్పింది. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె పుస్తెలతాడు తెగి కింద పడిపోయింది. దుండగుడు వాడిని పిస్తోలు మ్యాగ్జయిన్ కూడా పోలీసులకు సంఘటన స్థలంలో లభించింది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు కాస్త ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. సీఐ భవానీప్రసాద్, ఎస్‌ఐలు రాజేష్, నర్సింహమూర్తి తమ సిబ్బందితో వచ్చి పరిసరాలను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
వరుస ఘటనలతో బెంబేలు
మూడు నెలలుగా టెక్కలిలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలతో ప్రజలు ఇప్పటికే భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మహిళపై జరిగిన దాడి వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నా శాంతిభద్రతలను కాపాడటంలో, నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి.
వైద్య చికిత్సలో జాప్యం
దుండగుడి కాల్పుల్లో గాయపడిన స్వప్నకు చికిత్స అందించడంలో ఏరియా ఆస్పత్రి సిబ్బంది అనుచిత జాప్యం చేశారు. సుమారు గంటన్నరకు పైగా ఎక్స్‌రే యూనిట్‌లో ఆమెను నిరీక్షించేలా చేశారు. విద్యుత్ సరఫరా లేదనే కారణంతో జాప్యం చేయడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఎస్పీ పరిశీలన
ఈ ఉదంతంపై స్పందించిన జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ వెంటనే శ్రీకాకుళం నుంచి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఏరియా ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ దురాగతానికి పాల్పడిన వ్యక్తి ఒడిశా ప్రాంతానికి చెందిన వాడు కావచ్చని అభిప్రాయపడ్డారు. వేసవిలో దొంగతనాలకు పాల్పడే సమ్మర్ గ్యాంగ్ పని కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు ఉపయోగించిన పాయింట్ 22 బుల్లెట్ల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, కేవలం తప్పించుకునేందుకే వాటిని వినియోగించి ఉంటాడన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే జిల్లా అంతటా పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా గత డిసెంబర్‌లో జరిగిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల అప్పన్న హత్యకేసుకు సంబంధించి కొంత మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు.
కాల్పుల కల్లోలం
Published Sun, Mar 1 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement