ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం
=ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం
=టీ-బిల్లు చర్చకు మరోసారి ప్రత్యేక సమావేశాలు సీమాంధ్ర మంత్రులతో భేటీలో కిరణ్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు నిర్ణయించారు. ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు చివరి తేదీ వరకూ సమయాన్ని వినియోగించుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతిని అదనంగా మరో 20 రోజుల సమయం కోరాలని కూడా వారు భావించారు.
సోమవారం అసెంబ్లీకి హాజరుకాని సీఎం కిరణ్ సాయంత్రం సీమాంధ్ర మంత్రులతో తన నివాసంలో సమావేశమయ్యారు. అనారోగ్యం కారణంగా సోమవారం సభకు రాలేకపోయానని.. మంగళవారం సభకు వస్తానని.. బిల్లుపై చర్చను ఎప్పటి నుంచి చేపట్టాలో అప్పుడు నిర్ణయిస్తానని మంత్రులతో సీఎం చెప్పారు. ప్రస్తుత సమావేశాలకు సంబంధించిన ఎజెండాను బీఏసీలో ఖరారు చేసినందున వాటిపైనే ఇప్పుడు చర్చ సాగుతుందని, విభజన బిల్లు వచ్చినట్లు సభలో ప్రకటించినందున చర్చ ఎప్పుడైనా చేపట్టవచ్చని, రాష్ట్రపతే గడువు ఇచ్చినందున ఇప్పటికిప్పుడే దాన్ని తిప్పి పంపాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
ప్రతి అంశంపై చర్చకు సభ్యుడికి గంటకు పైగా సమయం పడుతుందని, ఈ లెక్కన జనవరి 23వరకు సభ నడవాల్సిందేనని సీఎం వివరించినట్టు మంత్రులు తెలిపారు. ఆర్టికల్ - 371డీపై రాజ్యాంగ సవరణ జరగకుండా విభజన చేయడానికి వీల్లేదని పునరుద్ఘాటించినట్లు సమాచారం. ముసాయిదా బిల్లు చర్చ ప్రారంభంపై తెలంగాణ మంత్రులు హడావుడి చేయడంపై సీమాంధ్ర మంత్రులు తప్పుబట్టారు. బిల్లుపై లోతుగా చర్చిస్తామని, ఎన్నిరోజులైనా చర్చలో పాల్గొంటామని మంత్రి ప్రతాప్‌రెడ్డి.. సీఎంతో సమావేశానంతరం విలేకరులకు తెలిపారు. సభలో విభజన బిల్లుపై సీమాంధ్ర నేతలంతా వ్యతిరేకంగా మాట్లాడతారని, తద్వారా తెలంగాణను అడ్డుకుంటామని మంత్రి టీజీ చెప్పారు.