
సాక్షి, అమరావతి: రైతుల ముసుగులో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య ధ్వజమెత్తారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎవరినైనా మోసం చేయగలననే పేటెంట్ హక్కు కలిగి ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలు ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేస్తున్నారని.. చంద్రబాబు ఏనాడు రైతు సంక్షేమం గురించి ఆలోచించ లేదన్నారు. గత టీడీపీ పాలనలో రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబాటులో ఉందని.. అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. పచ్చ మీడియా తో రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారు.
మూడు ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తోన్న కృషిని ప్రజలు స్వాగతిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపా తెలిపారు. ప్రజల మద్దతు సీఎం వైఎస్ జగన్‌కు ఉందన్నారు.
ప్రజలు సంతోషంగా ఉన్నారు..
సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అన్నారు. టీడీపీ నేతలు అమరావతి పేరుతో బాగుపడ్డారని విమర్శించారు. అమరావతికి సరైన సౌకర్యాలు లేవన్నారు. కనీసం రోడ్లు కూడా లేవని మండిపడ్డారు. మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుం బిగిస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో నాడు ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు..
అభివృద్ధి, సంక్షేమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఉండాలనే ఆలోచనతో సీఎం జగన్ అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.ఏపీలో ప్రజారంజక పాలన జరుగుతోందని.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చట్టం తీసుకురాబోతున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు ఏలుబడిలో ఐదు పకడ్బందీ రాళ్లు కూడా వేయలేదని.. వర్షం వస్తే సచివాలయంలో తడిసిపోవాల్సిన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న మంచి నిర్ణయాలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. కుయుక్తులు, కుట్రలు, అరాచకశక్తులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతులను సీఎం జగన్ ఆదుకుంటారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment