
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతీ పల్లెను సీఎం తన సొంత గ్రామంగా భావిస్తారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తన బినామీల కోసం ఆరాటపడుతున్నారు తప్ప.. ప్రజల ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణపై టీడీపీ, చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సొంత జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. (ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?)
చంద్రబాబుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా
‘‘చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్నారు. కానీ సీఎం జగన్ అలాంటివారు కాదు. రాష్ట్రంలో ప్రతి పల్లెను, అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయనను అన్నికులాలు ఆదరిస్తున్నాయి. అందుకే 151 సీట్లు ప్రజలు కట్టబెట్టారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆయనలో చాలా అద్భుతమైన నటుడు ఉన్నారు. జగ్గయ్య, ప్రకాశ్‌రాజ్ కంటే అద్భుతంగా చంద్రబాబు నటిస్తున్నారు. నిన్న అసెంబ్లీలో ఈ విషయం బయటపడింది. చంద్రబాబుకు ఆర్ధిక ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి సహకరించాల్సిందిగా చంద్రబాబుకు నేను నమస్కరిస్తున్నా. ఆర్థిక ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఎక్కడ తిరగబడతారో అని బాబు ఆందోళనతో దిగాలు చెందుతున్నారు. చంద్రబాబులోని గొప్ప నటుడు 70 ఏళ్లలో బయటకు వచ్చాడు. 40 ఏళ్లలోనే ఇది జరిగి ఉంటే కచ్చితంగా ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చి ఉండేది’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment