'న్యాయం గెలిచింది'
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంబరాలు
అనంతపురం : ప్రభుత్వ కుట్రలో భా గంగా అసెంబ్లీలో ఏ డాది పాటు సస్పెన్షన్ కు గురై న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని మహిళా విభాగం నాయకులు అన్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా హై కోర్టు తీర్పునివ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో వారు స్వీట్లు పంచుకుని సంబరాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ మాట్లాడుతూ న్యాయం గెలిచిందన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతున్న రోజాను ఎదుర్కొనలేక అధికారపక్షం చట్టానికి విరుద్ధంగా ఆమెను ఏడాదిపాటు సస్పెన్షన్ చేసిందన్నారు.
అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనుమల రామకృష్ణుడు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. నగర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ కోర్టు తీర్పుతో అధికారపక్షంవారి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందన్నారు. ఈ తీర్పుతో న్యాయస్థానాలపై గౌరవం, నమ్మకం మరింత పెరుగుతుందన్నారు.
కార్పొరేటర్లు హిమబిందు, జానకి మాట్లాడారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కుట్రలు మానుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రోజాను వారు కోరారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా ప్రధానకార్యదర్శులు టి.కృష్ణవేణి, కె.పార్వతి, కొండమ్మ, నాయకులు నాగలక్ష్మీ, ప్రమీలమ్మ, అజరాంబీ, షమీమ్‌అహమ్మద్, హేమ, లీలావతి, బికె కొండమ్మ, శోభ, రాజేశ్వరి, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.