జపాన్‌కు జై | The Japan officers designs final will be placed in the competition for public opinion today and tomorrow, show | Sakshi
Sakshi News home page

జపాన్‌కు జై

Published Sat, Mar 26 2016 1:35 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

జపాన్‌కు జై - Sakshi

జపాన్‌కు జై

ఎంపికైన ఆ దేశానికి చెందిన డిజైన్
అక్కడి నమూనాలోనే హైకోర్టు, అసెంబ్లీ
2018కల్లా ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణానికి యత్నాలు
తుది పోటీలో నిలిచిన డిజైన్లతో ప్రజాభిప్రాయం కోసం నేడు, రేపు ప్రదర్శన

 
సాక్షి, విజయవాడ బ్యూరో : అమరావతిలో జపాన్ శైలి నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ దేశానికి చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్‌కు.. కీలకమైన రాజధాని ప్రభుత్వ భవనాల డిజైన్ బాధ్యతలు అప్పగించింది. 900 ఎకరాల్లోని ఈ సముదాయంలోని నిర్మాణాలు ఎలా ఉండాలనే దానిపై ఈ సంస్థ ప్రాథమికంగా ఒక డిజైన్‌ను తయారు చేసింది. అందులో ఐకానిక్ నిర్మాణాలుగా గుర్తించిన హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లను ప్రత్యేకంగా రూపొందించింది. ప్రతిష్టాత్మకమైన ఈ రెండు భవనాలకు పూర్తిస్థాయి డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన మకి అసోసియేట్స్ తయారు చేయనుంది.

ఆ డిజైన్ల ప్రకారమే 2017 మే నెలలో వాటి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈలోపు పూర్తిస్థాయి డిజైన్లను ఈ సంస్థ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు భవన సముదాయంలోని మిగిలిన సచివాలయం, సీఎం నివాసం, రాజ్‌భవన్, విభాగాధిపతుల కార్యాలయాలు, సిబ్బంది క్వార్టర్లు, పార్కులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం ఎక్కడ, ఎలా ఉండాలనే మార్గదర్శకాలను ఈ సంస్థే ఖరారు చేయనుంది. ఈ మార్గదర్శకాల ప్రకారమే అన్ని భవనాలను 2018 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ప్రవేశం తుళ్లూరు వైపు...
తుళ్లూరు మండలంలోని రాయపూడి సమీపంలో ఈ భవన సముదాయం ఏర్పడనుంది. ఈ సముదాయంలోనికి ప్రవేశం తుళ్లూరు వైపున ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ అర్బన్ డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సముదాయాన్ని నిర్మించేందుకు మకి అసోసియేట్స్ డిజైన్ ఉపయోగపడుతుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. తుది పోటీలో ఉన్న మిగిలిన రెండు డిజైన్లు కూడా బాగున్నా మకి అసోసియేట్స్ డిజైన్ వైపే మొగ్గు చూపడానికి ఆ సంస్థ పర్యావరణానికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రధాన కారణంగా ఉంది. సముదాయంలోని అన్ని భవనాలపైనా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడా లేని రీతిలో ఒక ప్రభుత్వ భవన సముదాయంలో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించింది.

ఈ నిర్మాణాలన్నీ అద్భుతంగా ఉన్నా నిధుల సమస్య, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో అనుకున్న గడువులోపు ఇవి పూర్తవుతాయా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ డిజైన్లను ప్రజల్లో పెట్టి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శని, ఆదివారాల్లో ఈ మూడు డిజైన్లను డీవీ మనార్ హోటల్‌లో ప్రదర్శించనున్నారు. ప్రజలు వాటిని చూసి తమ అభిప్రాయాలు తెలపాలని సీఆర్‌డీఏ అధికారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement