- రాజధాని నిర్మాణంపై కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో రూ.20,935 కోట్ల పెట్టుబడి అవసరమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఐదేళ్లకాలంలో ఈ మొత్తాన్ని కేంద్రం సాయంగా అందించాలని కోరింది. అయితే రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేంద్రం నాలుగు రోజులక్రితం అంటే గత ఆర్థిక సంవత్సరం(2014-15) చివరి రోజున(మార్చి 31) రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లను, అలాగే రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు విడుదల చేసింది.
ఈ నిధులను రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు, రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకోసం వ్యయం చేశాకే మళ్లీ ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ నిధులను ఖర్చుచేసి వినియోగ పత్రాలను పంపిస్తేగానీ తదుపరి నిధులు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు.
ఆ సొమ్ము ఖర్చు చేశాకే మళ్లీ నిధులు
వెంటనే కొత్త రాజధానిలో పనులు ప్రారంభించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడం పూర్తి చేశాకే మళ్లీ కేంద్రాన్ని నిధులు అడగాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. అలాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, రాయలసీమ నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనులకోసం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, ఆ నిధులనూ వెంటనే ఖర్చు చేస్తేగానీ తదుపరి నిధులు ఇమ్మని కేంద్రాన్ని అడిగేందుకు అవకాశముండదన్నాయి. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం ఏ కార్యక్రమంకోసం నిధులిస్తే అదే కార్యక్రమానికి వ్యయం చేయాల్సి ఉంటుందని, లేదంటే నిధుల విడుదలను నిలుపుదల చేస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.