ఏకపక్ష సభ, పొగడ్తల మోత
ఏకపక్ష సభ, పొగడ్తల మోత
Published Wed, Dec 23 2015 11:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
ప్రశ్నోత్తరాల సమయం యావత్తూ ‘కీర్త’నలే!
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో మంగళవారం సభ వెలవెలబోయింది. కుడివైపు తప్ప ఎడమవైపు ఎవ్వరూ లేకపోవడంతో సభ ఆద్యంతం ఏకపక్షంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుకోసం అధికార పార్టీ శాసనసభ్యులు ఈ అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుని బృందగానాన్ని తలపించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో ప్రవేశిస్తూనే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. నిత్యం కరవుతో అల్లాడుతున్న రాయలసీమలో ఎల్‌నినో ప్రభావంతో ఇటీవల ఒక్కసారిగా కురిసిన వర్షాలకు భూ గర్భ జలాలు పెరిగితే అది కూడా చంద్రబాబు ‘ప్రతాపమే’ అన్నట్టు కొందరు సభ్యులు పొగిడారు.
చంద్రబాబు కృషితో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని ఓ సభ్యుడంటే... ఇంకోసభ్యుడు మరో అడుగు ముందుకేసి రాయలసీమ సహా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా పటాలు పెట్టి పూజిస్తున్నారంటూ ప్రభు భక్తి ప్రదర్శించారు. నీరు-చెట్టుపై చంద్రబాబు సోమవారం సభలో ఏమి మాట్లాడారో అవే అంకెల్ని మంత్రి దేవినేని మంగళవారం ఏకరవుపెట్టారు. సాగునీటి పారుదల పథకాలకు గత 16 నెలల కాలంలో రూ.పది వేల కోట్లు కేటాయించిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని చెప్పారు.
పట్టిసీమను సాధించిన చంద్రబాబు అపర భగీరథుడని మరో సభ్యుడు పొగడ్తలతో ముంచెత్తారు. సర్ ఆర్ధర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు, శివరామకృష్ణయ్య తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు చంద్రబాబు నాయుడేనని ఓ మంత్రి సాగిలపడ్డారు. ఆ పొగడ్తల్ని విని తట్టుకోలేక సభ నుంచి లాబీల్లోకి వచ్చిన ఓ సీనియర్ నేత... ‘నెల రోజుల కిందటి వరకు మంచినీళ్లు లేక రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అల్లాడిపోయిన విషయం ఏ సభ్యుడికీ గుర్తుకు రాలేదు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పొగడ్తలను చంద్రబాబు వింటే ఆయన సైతం సిగ్గుపడి ఉండేవారేమోనని ఆయన అనడంతో పక్కనున్న వారు పగలబడి నవ్వారు.
Advertisement