నిషేధానికి తూట్లు | assistant director warning to fisheries in ongole | Sakshi
Sakshi News home page

నిషేధానికి తూట్లు

Published Sun, Apr 30 2017 11:07 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

నిషేధానికి తూట్లు

నిషేధానికి తూట్లు

► సముద్రంలో కొనసాగుతున్న వేట
► చీరాలలో రెండు బోట్లు సీజ్‌
► నిబంధనలకు విరుద్ధంగా వెళితే     చర్యలు తప్పవు
► మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హెచ్చరిక

ఒంగోలు టౌన్‌: సముద్ర సంపద పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సముద్రంలో విధించిన వేట నిషేధానికి జిల్లాలో కొంతమంది మత్స్యకారులు తూట్లు పొడుస్తున్నారు. వేటను నిషేధించినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా చీరాల సముద్ర తీర ప్రాంతంలో వేట సాగిస్తున్న రెండు బోట్లను మత్స్యశాఖ అధికారులు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోఅక్కడక్కడా వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి వేటను అడ్డుకోకుంటే భవిష్యత్‌లో మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలోని 10 తీర ప్రాంత మండలాల్లో 102 కిలోమీటర్లమేర సముద్ర తీరం విస్తరించి ఉంది. 1700 సంప్రదాయ పడవలు, 43 మెకనైజ్డ్‌ బోట్లు, 2400 మోటరైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. వీటి ద్వారా 15 వేల మంది మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు.  సంప్రదాయ పడవలు సముద్రంలో 8 కిలోమీటర్లలోపు మాత్రమే వెళ్తుంటాయి.

మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లు మాత్రం సముద్రంలో 20 కిలోమీటర్ల వరకు వెళ్లి వేటను సాగిస్తూ ఉంటాయి. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే దశలో ఉన్నందున సంప్రదాయ పడవలతో వేట సాగించడం వల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లు మరింత లోపలికి వెళ్లి వేటను సాగిస్తున్నందున ఆ రెండు కేటగిరీలకు చెందిన బోట్లపై మత్స్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రంలో చేపలు గుడ్లు పెడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేటను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో నాలుగు వేలకుపైగా మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. ఈ బోట్లు సముద్రంలో 20 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లి వేట సాగిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల బోట్ల ద్వారా సాగించే వేటను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వేటపై నిషేధం విధించి పక్షం రోజులు కూడా కాకముందే కొంతమంది మత్స్యకారులు నిబంధనలకు విరుద్ధంగా వేట సాగించడంతో ఈ ప్రభావం మిగిలిన మత్స్యకారులపై కూడా చూపిస్తోంది.

సాయం దూరం..
సముద్రంలో వేట నిషేధించిన కాలంలో మత్స్యకారుల జీవనోపాధికి వేట సాగించే ప్రతి మత్స్యకారుడికి రూ.4 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ సకాలంలో ఎన్నడూ మత్స్యకారులు ఆ సాయాన్ని పొందిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎన్ని తీర ప్రాంతాలు ఉన్నాయి, ఎంతమంది మత్స్యకారులు వేట సాగిస్తున్నారు, వారి బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్‌ నంబర్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి.

పూర్తి స్థాయిలో మత్స్యకారులకు సంబంధించిన డేటా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారి గురించి సకాలంలో స్పందించకుండా విస్మరిస్తూనే ఉంది. వాస్తవానికి వేట నిషేధానికి ముందు ఆర్ధిక సాయం అందిస్తే ఆ రెండు నెలలు మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధికి కొంతమేర ఆసరాగా ఉంటుంది. ప్రభుత్వం నెలల తరబడి సాయం అందించకపోవడంతో ఆ పథకం ఉండికూడా ఉపయోగం లేకుండా పోతోందని మత్స్యకారులు వాపోతున్నారు.

‘ఉపాధి’కి నోచుకోని మత్స్యకారులు
జిల్లాలోని తీర ప్రాంత మండలాలకు చెందిన మత్స్యకారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలలపాటు సముద్రంలో వేటను నిషేధించిన నేపథ్యంలో సముద్రేతర మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులకు మాత్రం ఉపాధి హామీ పథకం అందని ద్రాక్షగా మారింది.

ఏటా కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను నిషేధించిన సమయంలో ఉపాధి హామీ పథకం కింద తమకు జీవనోపాధి కల్పించాలని మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నప్పటికీ వాటి చెవికెక్కడంలేదు. సముద్రతీర ప్రాంత మండలాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టడం ద్వారా ఒకవైపు తీర ప్రాంత గ్రామాల్లో అభివృద్ధి జరగడంతోపాటు మత్స్యకారులకు కూడా ఉపాధి లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement