బతుకుదెరువు కోసం వలస వెళ్లిన రాష్ట్రవాసులను మహారాష్ట్రలోని స్థానికులు చితకబాదారు.
మా పనులకు అడ్డొస్తారా అంటూ మహారాష్ట్రలో ఏపీ కూలీలపై దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బతుకుదెరువు కోసం వలస వెళ్లిన రాష్ట్రవాసులను మహారాష్ట్రలోని స్థానికులు చితకబాదారు. ‘మా పనులకు అడ్డొస్తారా.. తక్షణం మా ప్రాంతం నుంచి వెళ్లిపోండి..లేదంటే చంపేస్తాం’ అంటూ బెదిరించారు. ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలానికి చెందిన వందలాది మంది పనుల కోసం మహారాష్ట్రలోని పాల్గరు జిల్లాకు వలస వెళ్లారు. వీరితోపాటు శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలూ అక్కడే పనులు చేసుకుంటున్నారు.
ఇతర ప్రాంతాల వారివల్ల తమ ఉపాధికి గండి పడిందని స్థానికులు కొంతకాలంగా గొడవ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అక్కడి కూలీలు కర్రలు, రాడ్లతో పని దగ్గరే దాడికి దిగి, కాసేపటికి వెనుదిరిగారు. సాయంత్రం 6.30 గంటలకు ఏపీ కూలీలు నివాసముంటున్న విరార్ వెస్ట్ (థానే జిల్లా పరిధి) వద్దకు చేరుకుని మరోమారు దాడి చేశారు. ఈ దాడిలో పది మందికి పైగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దిక్కుచోచని బాధితులు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ అధికారులు తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.