- నిలదీసిన బాలిక తల్లిపై మూకుమ్మడి దాడి
- పోలీసుల అదుపులో యువకుడు
రావికమతం : ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను కొత్తకోట ఎస్‌ఐ శిరీష్‌కుమార్ శనివారం తెలిపారు. రావికమతం మండలం కిత్తంపేట గ్రామానికి చెందిన దాడి మణికంఠ(17) అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి బుధవారం సాయంత్రం ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రోదిస్తూ తల్లికి వివరించింది. వారు ఆ బాలికను నర్సీపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి శుక్రవారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు.
ఈ దారుణానికి పాల్పడిన మణికంఠను ఆ బాలిక తల్లి నలుగురిలో మందలించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు అతని పెద్దలతో వచ్చి బాలిక తల్లిపై మూకుమ్మడి దాడి చేశారు. బాధితులు కొత్తకోట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మణికంఠను అదుపులోకి తీసుకుని, దాడికి పాల్పడిన మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. నర్సీపట్నం రూరల్ సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.