మైనింగ్ సవరణ చట్టం – 2015కు ముందు ఉన్న లీజులను 50 ఏళ్లపాటు పొడిగించాల్సిందేనని తెలిపే కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌లోని భాగం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు మైనింగ్ లీజు 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ముఖ్యమంత్రి స్వార్థం ఉందంటూ విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తాను అధికారంలో ఉండగా 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు ఇప్పుడు అసత్యాలతో బురద జల్లాలని ప్రయత్నించడాన్ని రాజకీయ నాయకులే కాకుండా అధికారులు, మేధావులు తప్పుబడుతున్నారు. తనకు వంతపాడే ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం పట్ల టీడీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచిన చంద్రబాబు సర్కారు..
రాంకో సిమెంట్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 160 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ చంద్రబాబు సర్కారు 2017 మే 3న జీఓఎంస్ నంబరు 59 జారీ చేసింది.
– రాంకో సిమెంట్స్‌కే జగ్గయ్యపేట మండలంలో మరో 124.33 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓఎంస్ నంబరు 60 జారీ చేసింది. ఇదే సంస్థకు ఇదే మండలంలో మరో 60.72 హెక్టార్ల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓఎంస్ నంబరు 61 జారీ చేసింది.
– రాంకో సిమెంట్స్‌కు జగ్గయ్యపేట మండలంలో 633.90 ఎకరాల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ 2017 మే 12న జీఓఎంఎస్ నంబరు 71 జారీ చేసింది.
– కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జైపే బాలాజీ సిమెంట్స్‌కు 629.22 హెక్టార్ల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ 2017 మే 17న జీఓఎంస్ నంబరు 73 జారీ చేసింది.
– కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్‌కు 775.570 హెక్టార్ల మైనింగ్ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ చంద్రబాబు సర్కారు 2019 జనవరి 3న జీఓఎంఎస్ నంబరు 6 జారీ చేసింది.
– కర్నూలు జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్స్‌కు 844.988 హెక్టార్లు, ఇదే జిల్లాలో మరోచోట 395.150 హెక్టార్ల మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ ఎన్నికల ముందు 2019 ఫిబ్రవరి 12న జీఓఎంఎస్ నంబరు 37, జీఓఎంఎస్ నంబరు 38 జారీ చేసింది. ఇలా చంద్రబాబు సర్కారు నాడు 30 సంస్థలకు వేలాది ఎకరాల మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ జీఓలు ఇచ్చింది.
తాను తెచ్చిన చట్టమే..!
ఎన్డీయే ప్రభుత్వం 2015లో ఎంఎండీఆర్ సవరణ చట్టం – 2015 తెచ్చింది. అప్పట్లో టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారంలో ఉంది. తాను భాగస్వామిగా ఉంటూ తెచ్చిన చట్టం ప్రకారమే నాడు చంద్రబాబు సర్కారు 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
రాజకీయ కక్షతో రద్దు...
– సరస్వతీ పవర్ అండ్ ఇండ్రస్టీస్‌కు 2009 మే 18వతేదీన ఉమ్మడి రాష్ట్ర హయాంలో 613 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజు మంజూరు చేస్తూ జీవో జారీ అయింది. అయితే రాజకీయ కక్షతో తెలుగుదేశం ప్రభుత్వం 2014 అక్టోబరు 9న ఈ మైనింగ్ లీజును రద్దు చేసింది.
– కక్షపూరితంగా తమ లీజును రద్దు చేశారంటూ సరస్వతీ పవర్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. లీజును పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లీజును రద్దు చేయడం అన్యాయమని, దానిని పునరుద్ధరించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు లీజును పునరుద్ధరిస్తూ 2019 డిసెంబరు 12న జీఓనంబరు 109 జారీ చేశారు.
– 2015 ఎంఎండీఆర్ సవరణ చట్టం వచ్చేనాటికి ఉన్న మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగించాల్సిందేనని (డీమ్డ్ టు) అని సెక్షన్ 8 ఏ (3)లో ఉన్న నిబంధన మేరకు గతంలో చంద్రబాబు సర్కారు 30 సంస్థలకు ఇచ్చినట్లే సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం లీజు పొడిగిస్తూ ఈనెల 8న జీవో ఇచ్చింది.
30 సంస్థలకు ఎలా పొడిగించారు?
– సరస్వతీ ఇండస్ట్రీస్‌కు లీజు పొడిగింపు స్వార్థమంటూ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు గతంలో ఆయన 30 సంస్థలకు ఏం ఆశించి 50 ఏళ్ల పాటు లీజు పొడిగించారో జవాబు చెప్పాలని పేర్కొంటున్నారు.
– ఇసుక ద్వారా దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ వల్ల సర్కారుకు రూ.2,500 కోట్ల రాబడి నష్టం వాటిల్లిందని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడే అంగీకరించారు. ఇంతకంటే ఇంకేం ఆధారాలు కావాలి?’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
– లేటరైట్ లీజుల్లో దండుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లేటరైట్ లీజు కూడా ఇవ్వలేదని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తుండటం గమనార్హం.
చట్టం చెబుతున్నదేమిటంటే..
కేంద్ర ప్రభుత్వం 2015లో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ (ఎంఎండీఆర్ –2015) చట్టాన్ని తెచ్చింది. అప్పటికే మైనింగ్ లీజులు ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకుంటే లీజును 50 ఏళ్లకు కచ్చితంగా పొడిగించాలని ఈ చట్టంలోని సెక్షన్ 8 ఏ (3) స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధన ప్రకారమే గతంలో చంద్రబాబు సర్కారు 30 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఇదే నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధికారులు 50 ఏళ్లకు మైనింగ్ లీజు పొడిగిస్తూ ఉత్తర్వులిస్తే అది తప్పన్నట్లు చంద్రబాబు బురద చల్లేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment