
రాజధానిలో బ్రేకేసిన ఆటోలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో సమ్మె కారణంగా దాదాపు చాలా వరకు ఆటోలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఆటోల్లో మీటర్ చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాల పెంపు జీవోను రద్దు చేయాలని కోరుతూ... ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టింది. దీంతో హైదరాబాద్‌లో తిరిగే లక్షా 20 వేల ఆటోల్లో 65 శాతం వరకు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
అందులో సుమారు 25 వేల స్కూల్ ఆటోలు నిలిచిపోవడంతో... విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు.. మహాత్మాగాంధీ, జూబ్లీ తదితర బస్‌స్టేషన్ల వద్ద ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. దాంతో శనివారం సిటీ బస్సులు కిక్కిరిసిపోయాయి. అయితే, బీఎంఎస్‌తో పాటు మరికొన్ని ఆటో సంఘాలు సమ్మెకు దూరంగా ఉండడంతో.. పలు ప్రాంతాల్లో ఆటోలు తిరిగాయి. కొందరు ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అందినకాడికి వసూలు చేయడం కనిపించింది. కాగా.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని, ఆదివారం నుంచి మరింత ఉధృతం చేస్తామని ఆటో జేఏసీ ప్రతినిధులు సత్తిరెడ్డి, వెంకటేశం తెలిపారు.
సమ్మె ప్రభావం...
మొత్తం ఆటోలు : లక్షా 20 వేలు
సమ్మెలో పాల్గొన్నవి : 65 శాతం
తిరిగిన ఆటోలు : 35 శాతం
సమ్మెకు మద్దతునిస్తున్న సంఘాలు : 16 (ఆటో సంఘాల జేఏసీ)
దూరంగా ఉన్న సంఘాలు : బీఎంఎస్, ఆటో సంఘాల
నాన్ పొలిటికల్ జేఏసీ