అవినాష్ దీక్షతో దిగివచ్చిన జెన్‌కో
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లోని 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌కు భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో మంగళవారం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్టీపీపీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి తనయుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీంతో ఏపీజెన్‌కో యాజమాన్యం దిగివచ్చింది.
జెన్‌కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డిలతో రైతుల సమక్షంలో చర్చలు జరిపారు. 96 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని, అవి కూడా జనవరి 1న నేరుగా గేట్ పాసులు ఇచ్చి అనుమతిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో వారు ఇచ్చిన హామీ మేరకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దీక్షను విరమించారు.
మొదటి దఫా చర్చలు విఫలం: ఆగ్రహించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
భూ నిర్వాసితుల తరఫున ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డిలు ఆర్టీపీపీ సీఈ ఛాంబరులో జెన్‌కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాదులో ఏపీ జెన్‌కో ఎండీ, సీఎండీని తాను, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలసి ఉద్యోగాలు ఇవ్వాలని కోరామన్నారు.
అందుకే ఆయన మిమ్మల్ని ఆర్టీపీపీకి పంపారని చెప్పారు. ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎంత మందికి ఇస్తారు, తదితర విషయాలు చె ప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయని కచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని డెరైక్టర్ చెప్పారు. దీంతో అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ భూములు తీసుకుని కాలయాపన చేసింది చాలక ఇంకా ఒత్తిళ్లు ఉన్నాయని తప్పుకునే ప్రయత్నం చేస్తారా’ అంటూ చర్చలో నుంచి లేచి వచ్చి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఎంపీకి సంఘీభావంగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి కూడా కూర్చున్నారు.
మూడు గంటల పాటు ఎంపీ దీక్ష...
ఉదయం 11.45 నిమిషాలకు అవినాష్ దీక్ష ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీజెన్‌కో ఎండీ విజయానంద్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఎంపీకి ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు. తొలుత భూ నిర్వాసితులకు ఉద్యోగాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
రెండో దఫా చర్చలు సఫలం...
ఏపీ జెన్‌కో యాజమాన్యం దిగి వచ్చి రెండో దఫా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో చర్చలు జరిపింది. ఈసారి చర్చల్లో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డితో పాటు భూ నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు. ఈ చర్చల్లో భూ నిర్వాసితులకు 96 ఉద్యోగాలు ఇస్తామని, అవి కూడా జనవరి 1వ తేదీలోగా గేట్ పాసులు ఇస్తామని ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్ చెప్పారని డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావు ప్రకటించారు.
దీక్షను విరమింపజేసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి..
చర్చలు సఫలం కావడంతో దీక్షలో కూర్చున్న భూ నిర్వాసితులకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డిలు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.