ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల టౌన్: పట్టిసీమ విషయంలో తప్పుడు ప్రచారం, పోలవరం ప్రాజెక్టు చేపట్టాల్సిన ఆవ శ్యకతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించేందుకు వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి గురించి రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పట్టిసీమ గురించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్షం తెలిపిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రోజుకో వాదంతో కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేని పట్టిసీమపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టును అడ్డగించేందుకే చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జగన్ ఢిల్లీకి వెళ్లారన్నారు. దీనిని వక్రీకరిస్తూ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుతో పాటు అన్ని అంశాలను చర్చించేందుకు ప్రధానిని జగన్ ఎంపీల బృందంతో కలసి వెళ్లినట్లు చెప్పారు.
దీనిని రాద్దాంతం చేస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. చీకటి ఒప్పందాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటని, అందుకే ప్రతి అంశాన్ని అలాగే ఆలోచించి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందించటం బాధ్యతగా భావించిన జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు మాని రాష్ట్ర అభివృద్ధి గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తే మంచిదని హితవుపలికారు.