చినబాబు.. ఆయన తోడల్లుడి మధ్య సీట్ల వివాదం తన కుటుంబంలో చిచ్చురేపి.. తలబొప్పి కట్టించే స్థాయికి చేరుకోవడం.. ఒత్తిడికి తలొగ్గి చివరికి చినబాబును మంగళగిరికి తరలించడం ద్వారా టీడీపీ అధినేత ఉపద్రవం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంత్రి అయ్యన్న రూపంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టిక్కెట్ల ఖరారును మరిన్ని చిక్కుముడులతో సంక్లిష్టం చేస్తున్నాయి. నర్సీపట్నం అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ సీటును తన వారసుడికి ఇవ్వాలని అయ్యన్న పట్టుపడుతున్నారు. గత ఎన్నికల్లో తన వర్గానికి చుక్కలు చూపించిన ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు ఎంపీ సీటు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదని అధినేతకు స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి గంటాను అనకాపల్లి ఎంపీ లేదా అసెంబ్లీ పోటీ చేయించడానికి కూడా వీల్లేదని పట్టబడుతున్నారు. ఫలితంగా ఈ చిక్కుముడిని ఎలా విడదీయాలో.. సీట్లు ఎవరికి ఖరారు చేయాలో తెలియక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. గాజువాక, ఉత్తర, పాయకరావు పేటల్లోనూ ఇదే గందరగోళం నెలకొంది.
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు గంటా మరోవైపు అయ్యన్న తమ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో సీట్ల ఖరారు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. భీమిలి లేదా విశాఖ ఉత్తర నుంచి తన పుత్రరత్నాన్ని ఎలాగైనా బరిలోకి దింపాలని తొలుత ఆశపడిన చంద్రబాబు అధికారిక ప్రకటన కూడా చేశారు. పుత్రుడి కోసమే విశాఖ లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న లోకేష్ తోడల్లుడు భరత్ ఆశలపైనా నీళ్లు చల్లారు. తోడల్లుళ్లిద్దరికీ ఒకే జిల్లాలో సీట్లు ఇవ్వడం కుదరని చంద్రబాబు తేల్చిచెప్పడంతో భరత్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన మామ, సినీ నటుడు బాలకృష్ణపై ఒత్తిడి తీసుకురావడంతో భరత్‌కు ఎంపీ సీటు ఇవ్వాల్సిందేనని ఆయన చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. కుటుంబంలో చిచ్చు రేగడంతో గత్యంతరం లేక తన కుమారుడిని మంగళగిరి నుంచి బరి లోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో భరత్‌కు లైన్ క్లియర్ అయినట్టయ్యింది.
ఆడారికి ఎంపీ సీటిస్తే పోటీ చేయనంటున్న అయ్యన్న?
మరోవైపు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్న అధినేతకు అయ్యన్న ఒత్తిళ్లు అయోమయంలో పడేస్తున్నాయి. గత ఎన్నికల్లో తన శిష్యుడైన మాడుగుల టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు ఓటమికి పని చేయడంతో పాటు.. తనకు చుక్కలు చూపించిన ఆడారి కుటుంబానికి చెక్ పెట్టాలని అయ్యన్న పావులు కదుపుతున్నారు. తులసీరావు కుమారుడు ఆనంద్‌కు ఏ సీటు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు.. అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తే మాత్రం కుదరదని తెగేసి చెప్పినట్టు చెబుతున్నారు. కావాలంటే యలమంచలి సీటు ఇచ్చుకోండి అంతే కానీ అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చి మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. అదే జరిగితే తాను పూర్తిగా పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడనని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.
గంటాకు కూడా నో..
టీడీపీలోకి వస్తారని భావిస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఇచ్చినా అభ్యంతరం లేదంటున్న అయ్యన్న అనకాపల్లి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు తెరపైకి గంటా పేరు రావడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు తన శిష్యుడు గవిరెడ్డి రామానాయుడుకు మాడుగుల సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో తులసీరావు వల్లే గవిరెడ్డి ఓటమి పాలయ్యారని, ఈసారి అతనికి సీటు ఇవ్వాలని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని అయ్యన్న అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది.
సబ్బంహరి కోసం ఐవీఆర్‌ఎస్ సర్వే
మరో విచిత్రమైన రాజకీయం టీడీపీలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సిట్టింగ్‌లు, ఆశావాహుల్లో ఎవరు సమర్ధులో నిర్ణయించేందుకు ఐవీఆర్‌ఎస్ ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కానీ తొలిసారి అసలు పార్టీలోకే ఇంకా రాని సబ్బంహరికి టికెట్ ఇస్తే బాగుంటుందా? పంచకర్ల రమేష్‌బాబు అయితే బాగుంటుందా..? అని విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి ఐవీ ఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి ఎవర్ని బరిలోకి దింపాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. మరో వైపు బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా టీడీపీ తరపున ఈ సీటును ఆశిస్తున్నారు. ఒక వేళ టీడీపీ నుంచి పిలుపు రాకపోకే జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నట్టుగా తెలియ వచ్చింది.
పల్లాకు రెబల్ బెడద
గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు టికెట్ ఖరా రు చేసినట్లు పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలొచ్చాయి. దాంతో ఈ సీటు ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు తన అనుచరులతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పల్లాకు సీటు ఇస్తే తాను రెబల్‌గా బరిలోకి దిగుతానని బుధవారం మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు పెట్టుకునే ప్రచారానికి వెళ్తానని, పల్లాను ఓడించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment