నిర్ణయం బీఏసీదే...
Published Mon, Jan 27 2014 1:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
సీఎం నోటీసుపై దిగ్విజయ్ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన నోటీసుపై శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంటుందని.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. బిల్లును తిప్పిపంపాలని సీఎం నోటీసు చ్చిన అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దిగ్విజయ్ ఆదివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘రాజ్యంగ విరుద్ధంగా ఉన్న అంశాలు బిల్లులో ఉంటే వాటిని సరిదిద్దేందుకు రాజ్యాంగంలోనే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆయన బదులిచ్చారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ గురించి ప్రశ్నించగా.. ‘‘రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రాయాల కోసమే అసెంబ్లీకి పంపించాం. ప్రస్తుతం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 87 మంది చర్చలో పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. వారంతా చర్చలో పాల్గొనడం శుభపరిణామం.. వారందరికీ కృతజ్ఞతలు’’ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో చర్చ జరుగుతోందని, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారన్న వార్తలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు.
దిగ్విజయ్‌తో జానారెడ్డి భేటీ
తెలంగాణ ప్రాంత సీనియర్ మంత్రి జానారెడ్డి ఆది వారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగ్విజయ్‌తో గంట పాటు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించడం, లేక తిరస్కరించే హక్కు శాసనసభకు ఉంటుందా? బిల్లు తిప్పి పంపాలంటూ సీఎం ఇచ్చిన నోటీసు సరైనదేనా? అన్న అంశాలపై వారిద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, బిల్లుపై ఓటింగ్ లేకుండా కేవలం అభిప్రాయానికే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌ను జానార కోరారని తెలిసింది. అలాగే.. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలిపి టీఆర్‌ఎస్ నిలబెడుతున్న అభ్యర్థికి కాంగ్రెస్‌లోని మిగతా సభ్యుల మద్దతు ఇవ్వాలని సూచించినట్లు చెప్తున్నారు. దిగ్విజయ్ స్పందిస్తూ.. తెలంగాణపై అధిష్టానం ముందుగా నిర్ణయించిన మేరకు అంతా జరుగుతుందని, ఫిబ్రవరి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తెచ్చేందుకు అన్ని ప్రయాత్నాలు చేస్తున్నామన్నట్టు సమాచారం.
మంత్రులతో చర్చించకుండా సీఎం తీర్మానమా?
ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అదే ప్రభుత్వంలోని మంత్రులతో చర్చించకుండా తీర్మానం తేవడం సబబు కాదని జానారెడ్డి తప్పుపట్టారు. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజనతో తెలంగాణ ప్రాంతమే ఎక్కువ నష్టపోతుందని చెప్తున్న సీఎం.. మరెందుకు అదే తెలంగాణను పట్టుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు.
Advertisement
Advertisement