
'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తాం'
ధర్మవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తామని, అందుకోసం రాజీలేని పోరాటం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం జరిగిన తెలుగుదేశం మినీమహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చారన్నారు.
మోదీపై తనకు నమ్మకముందని, త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అనంత వాసులు టీడీపీపైనేగాక ప్రత్యేకంగా నందమూరి కుటుంబంపై అభిమానం చూపుతారని, అందుకు జిల్లా వాసులకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ధర్మవరంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన తెలిపారు.