కమీషన్ల కోసం చౌక విద్యుత్‌కు కోత! | Balineni Srinivas Reddy Slams On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసం చౌక విద్యుత్‌కు కోత!

Published Fri, Oct 11 2019 4:21 AM | Last Updated on Fri, Oct 11 2019 6:10 AM

Balineni Srinivas Reddy Slams On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చౌక విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి నిర్వాకాల వల్లే ఎన్టీపీసీకి చెందిన కుడిగి విద్యుత్‌ను యూనిట్‌ రూ.11.68 చొప్పున కొనాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కమీషన్లు ముట్టజెప్పే పవన, సౌర విద్యుదుత్పత్తి కంపెనీలతో లాలూచీ పడటం వల్ల రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని ఈ మేరకు గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కర్నాటకలోని కుడిగి విద్యుత్‌ను యూనిట్‌ రూ. 4.80కే ఇచ్చేలా విద్యుత్‌ సంస్థలు ఉమ్మడి రాష్ట్ర హయాంలోనే 2010 సెప్టెంబర్‌ 23న ఒప్పందం చేసుకున్నాయని బాలినేని వివరించారు. ఆ ఒప్పందం ప్రకారమే టీడీపీ సర్కారు విద్యుత్‌ తీసుకుని ఉంటే యూనిట్‌ రూ.4.80కే లభించేదన్నారు. కానీ కుడిగి విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ అందుబాటులో ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లను తగ్గించేశారని, మరోవైపు ఎంవోయులో పేర్కొన్న ప్రకారం స్థిర విద్యుత్‌ ఛార్జీలు (ఫిక్స్‌డ్‌) చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల కుడిగి విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.11.68కు కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కొన్నా.. కొనకున్నా ఫిక్స్‌డ్‌ చార్జీలు చెల్లించాల్సిందే
కుడిగి విద్యుత్‌లో ఏపీకి 360 మెగావాట్లు ఇచ్చేలా ఒప్పందం ఉందని మంత్రి బాలినేని తెలిపారు. దీనివల్ల యూనిట్‌ రూ.4.8 చొప్పున (రూ. 1.2 ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, రూ. 3.58 వేరియబుల్‌ ఛార్జీలు) ఏడాదికి 2,681 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేయాలన్నది పీపీఏలో భాగమన్నారు. అయితే చంద్రబాబు హయాంలో కుడిగి ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో 2,681 మిలియన్‌ యూనిట్లు కొనకుండా కేవలం 392 మిలియన్‌ యూనిట్లు మాత్రమే కొనుగోలుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి పీపీఏ ప్రకారం కేటాయించిన విద్యుత్‌ తీసుకున్నా, తీసుకోకపోయినా ఏటా రూ.317 కోట్లు స్థిర ధర (ఫిక్స్‌డ్‌) చెల్లించాల్సి వస్తుందన్నారు.అదే 2,681 మిలియన్‌ యూనిట్లు తీసుకుని ఉంటే ప్రతి యూనిట్‌ ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ రూ. 1.20 మాత్రమే అయ్యేదని, కానీ 392 మిలియన్‌ యూనిట్లే తీసుకోవడం వల్ల ఇది యూనిట్‌కు 8.10 చొప్పున అవుతుందని తెలిపారు.

దీనికి తోడు చర వ్యయం (వేరియబుల్‌ కాస్ట్‌) యూనిట్‌కు రూ. 3.58 చొప్పున చెల్లిస్తున్నామని, ఫలితంగా యూనిట్‌ విద్యుత్తు ధర రూ. 11.68 అవుతోందని తెలిపారు. ఇది డిస్కమ్‌లకు తీవ్ర నష్టమని బాలినేని వివరించారు. చంద్రబాబు తన అనుయాయులకు చెందిన సోలార్, విండ్‌ కంపెనీలకు మేలు చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. కుడిగి నుంచి పూర్తిస్థాయిలో 2,681 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేసినా లేక 392 మిలియన్‌ యూనిట్లు మాత్రమే కొన్నా లేదంటే అసలు కరెంటు కొనుగోలు చేయకున్నా ఒప్పందం ప్రకారం ఫిక్స్‌డ్‌ ఛార్జీల రూపంలో ఏడాదికి రూ.317 కోట్లు చెల్లించాల్సి వస్తోందని మంత్రి తెలిపారు.

బాబు నిర్వాకాలతో రూ. 562.4 కోట్లు నష్టం
సోలార్, విండ్‌ పవర్‌ కంపెనీలతో కుదుర్చుకున్న పీపీల ప్రకారం గత ప్రభుత్వం కుడిగి ఎన్టీపీసీ ప్లాంట్‌ నుంచి యూనిట్‌  రూ.3.58 చొప్పున వస్తున్న కరెంటును తగ్గించేసి రూ.4.84కి సోలార్, విండ్‌ పవర్‌ను కొనుగోలు చేయడంతో కుడిగి ప్లాంటుకు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఛార్జీ యూనిట్‌కు రూ.1.2 నుంచి రూ.8.2కు పెరిగిందని మంత్రి బాలినేని తెలిపారు. అంతేకాకుండా యూనిట్‌కు అదనంగా రూ.1.26 చొప్పున చెల్లించాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో మొత్తంమీద ఈ వ్యవహారంలో రూ. 562.4 కోట్లు నష్టం జరిగిందని బాలినేని వెల్లడించారు. కుడిగి ప్లాంటు విద్యుత్‌ ధర అధికంగా ఉన్నందువల్ల ఆ కేటాయింపును మినహాయించి మరోచోట ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌శాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని బాలినేని తెలిపారు.  

గత ప్రభుత్వం కన్నా తక్కువ ధరకే కొనుగోలు
రాష్ట్రంలో అధిక ధరకు కరెంటు కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలను మంత్రి బాలినేని తోసిపుచ్చారు. బొగ్గు కొరతతో సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తక్కువ ఖర్చుకే కరెంటు కొనుగోలు చేశామని తెలిపారు. 2018 అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో విద్యుత్‌ ఎక్సే్ఛంజి ద్వారా తక్కువ ధరకే విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామంటూ ఆ వివరాలను మంత్రి విడుదల చేశారు.

కుడిగి విద్యుత్‌ నష్టం ఇలా..!

►360 మెగావాట్లకు ఫిక్స్‌డ్‌ ఛార్జీ : 317 కోట్లు

►కుడ్గీ నుంచి లభించే విద్యుత్‌ : 2681 మిలియన్‌ యూనిట్లు

►దీనివల్ల యూనిట్‌ ధర : 4.80 (1.20 ఫిక్స్‌డ్‌... 3.58 వెరీయబుల్‌)

►2019–20లో ఏపీఈఆర్‌సీ గుర్తించిన విద్యుత్‌ : 1729 మిలియన్‌ యూనిట్లు
దీనికి అయ్యే ఖర్చు యూనిట్‌కు  రూ. 5.38 (1.80 ఫిక్స్‌డ్‌.. రూ. 3.58 వేరియబుల్‌)

ఏపీఈఆర్‌సీ అనుమతించింది 392 మిలియన్‌ యూనిట్లు

►దీనివల్ల ప్రతీ యూనిట్‌ ధర :  రూ. 11.68 (రూ. 8.10 ఫిక్స్‌డ్‌... 3.58 వేరియబుల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement