
వైఎస్సార్‌సీపీలోకి ఎమ్మెల్యే కాటసాని
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామిరెడ్డితో పాటు సెంట్రల్ బ్యాంక్ డెరైక్టర్ పీఆర్ మురళీమోహన్‌రెడ్డి, ఎస్.రాంమోహన్‌రెడ్డి, పి.శీలారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. అనంతరం రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనోభావాల మేరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అండగా ఉండే ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతానికి చేసిన ద్రోహంతో ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.