
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/బనగానపల్లె రూరల్: బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి సొంతూరులో షాక్ తగిలింది. గ్రామంలోని బంధువులంతా సోమవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరి షాక్ ఇచ్చారు. 13వ రోజు ప్రజా సంకల్పయాత్రను జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం బనగానపల్లె నుంచి ప్రారంభించారు. బత్తులూరుపాడు మీదుగా ఎమ్మెల్యే సొంతూరు యనకండ్లకు చేరుకోగా ఆయన బంధువర్గంలోని రామ్మోహన్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, సాధుల శివశంకర్‌రెడ్డి, మరో 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనకండ్ల గ్రామం జన సంద్రాన్ని తలపించింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పూల వర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి బారులు తీరి కనిపించారు.