జిల్లాలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఇంతకుముందు ఎంతో మెరుగ్గా ఉండేది. దీనివల్ల బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు
డీఆర్‌డీఏకు తొమ్మిది నెలలుగా సారథి కరువు
డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని విస్మరించిన అధికారులు
రుణాల మంజూరు మృగ్యం
రూ. 1,015 కోట్లకు గాను రూ.30 కోట్లు మాత్రమే మంజూరు
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఇంతకుముందు ఎంతో మెరుగ్గా ఉండేది. దీనివల్ల బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. లక్ష్యంలో 50 శాతం రుణాలివ్వడం కూడా గగనంగా మారింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు రూ.1,015 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా రూ.30 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. గతంలో ప్రతి సంఘానికి రూ.5 లక్షల వరకూ రుణాలిచ్చేవారు. ఈ మొత్తాన్ని డ్వాక్రా మహిళలు జీవనోపాధి కోసం ఉపయోగించుకునేవారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు రుణాలివ్వాలంటేనే బ్యాంకర్లు వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వం రుణమాఫీ చేయకపోయినా జిల్లాలో వేలాది సంఘాలు కంతులు సక్రమంగానే చెల్లిస్తున్నాయి. అయినా బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. కంతులు చెల్లిస్తున్నా రుణాలు ఎందుకివ్వరని బ్యాంకర్లను గట్టిగా ప్రశ్నించే అధికారులే కరువయ్యారు. గతంలో బ్యాంకర్లతో, క్షేత్రస్థాయి అధికారులతో వెలుగు సిబ్బంది నిత్యం సమావేశాలు నిర్వహిస్తుండేవారు. విరివిగా రుణాలు ఇప్పించేవారు. లక్ష్యానికి మంచి రుణాలిచ్చిన సమయంలో బ్యాంకర్లకు గౌరవంగా విందు కూడా ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం బ్యాంకర్లను సమన్వయం చేసుకోవడంలో ఐకేపీ అధికారులు విఫలమయ్యారు.
దీనివల్ల సంఘాల పనితీరు అధ్వానంగా తయారవుతోంది. జిల్లాలో 52 వేల సంఘాలుంటే 6,700 మాత్రమే ఏ గ్రేడ్‌లో(పనితీరు మెరుగు) ఉన్నాయి. మరో 5 వేల సంఘాలు బీ గ్రేడ్(పర్వాలేదు)లో ఉన్నాయి. మిగిలిన 40,300 సంఘాలు సీ,డీ గ్రేడ్‌లో అంటే పూర్తి అధ్వానంగా నడుస్తున్నాయి. వరుస కరువుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల ఆర్థిక లావాదేవీలు పూర్తిగా పడిపోయాయి. ఉన్న ఊళ్లో ఉపాధి లేక వలస పోతున్నారు.
ఇలాంటి సమయంలో డ్వాక్రా మహిళలకు విరివిగా రుణాలిప్పించి.. సొంతూళ్లలోనే ఉపాధి కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. డీఆర్‌డీఏ-వెలుగులో కీలకమైన ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టే ఖాళీగా ఉంది. రెండు ఏపీడీ పోస్టులు, కదిరి, ధర్మవరం, పామిడి, తాడిపత్రి ఏరియా కో ఆర్డినేటర్ పోస్టులు కొన్నేళ్ల నుంచి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ స్థానాల్లో ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన అధికారులు రెండు పడవలపై ప్రయాణం సజావుగా సాగించలేకపోతున్నారు.