హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మరణానికి ..
రోహిత్ మృతిపై కొనసాగుతున్న ఆందోళనలు
మదనపల్లెలో మానవహారం, రిలేదీక్షలు ఎమ్మెల్యే మద్దతు
మహిళా వర్సిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు
చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి)/మదనపల్లె/చిత్తూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కూడా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద విద్యార్థినులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోహిత్ మరణం బాధాకరణమని, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, అధ్యాపక సంఘం అధ్యక్షురాలు కృష్ణకుమారిలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. రోహిత్‌కు నివాళులర్పించారు.
మహిళా డిగ్రీ కళాశాలలో..
శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలోని పద్మావతి విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. రోహిత్ విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొన్న దీనపరిస్థితులవల్లే ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు ఏ విద్యాసంస్థల్లో జరగకూడదని నినదించారు. సంఘటనపై బాధ్యులను శిక్షించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, టీఎస్‌ఎఫ్ నాయకులు అక్కులప్ప, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘనాయకులు మురళీధర్, ప్రభు, వెంకటస్వామి తదితరులుపాల్గొన్నారు.
దళిత సంఘాల నివాళి
రోహిత్ మృతికి సంతాపంగా తిరుపతిలో గురువారం రాత్రి దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘనంగా నివాళులు అర్పించారు.