
తడవాల్సిందే..!
- అధ్వానంగా రైతుబజారులు
- వర్షం వస్తే నీటిలోనే వ్యాపారాలు
- అల్లాడుతున్న రైతులు, వినియోగదారులు
విజయవాడ : జిల్లాలోని అన్ని రైతుబజార్లలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధ్వానంగా మారాయి. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎండకు అల్లాడిన రైతులు ఇప్పుడు వర్షాలకు నానుతున్నారు. చిన్నపాటి వర్షాలకే జిల్లాలోని పలు రైతుబజార్లు తటాకాలను తలపిస్తున్నాయి.
జిల్లాలో 17 రైతుబజార్లు..
జిల్లాలో 17 రైతుబజార్లు ఉన్నాయి. విజయవాడలోనే ఐదు ఉన్నాయి. స్వరాజ్యమైదానం రైతుబజారులో స్టాల్స్ సరిపోవడం లేదు. రైతులు ప్లాట్‌ఫారాలపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థ వల్ల వర్షం కురిసినప్పుడు రైతులు, ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పటమటలోని రైతుబజారులోనూ సరిపడా స్టాల్స్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మచిలీపట్నంలోని రైతుబజారులో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాల్స్ కూడా సరిపోవడం లేదు. గుడివాడ, ఉయ్యూరు, జగ్గయ్యపేట రైతుబజార్లలో వర్షం వ స్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
కలగా మారిన కొత్త రైతుబజార్లు
విజయవాడలోని రాణిగారితోట, సత్యనారాయణపురంతోపాటు గన్నవరం, కైకలూరు, పెడన, తిరువూరు, అవనిగడ్డలలో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల నుంచి భావిస్తున్నారు. స్థల సమస్య వల్ల కార్యరూపం దాల్చడంలేదు. తిరువూరుకు ఐదేళ్ల క్రితమే రైతుబజారు మంజూరైంది. రూ.10 లక్షల నిధులు కూడా కేటాయించగా ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయాయి. తిరువూరులో మూడుచోట్ల స్థలాలను పరిశీలించినా ఫలితం లేకపోయింది.
కంకిపాడులోనూ రూ.8లక్షలు మంజూరైనా ఇప్పటి వరకు స్టాల్స్ నిర్మించలేదు. స్థల సమస్యవల్లే కైకలూరు, గన్నవరం, పెడన, అవనిగడ్డలలో రైతుబజారుల ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. రెవెన్యూ, మార్కెటింగ్, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయలోపం వల్లే రైతుబజారులకు స్థలాలు లభించడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో కలెక్టర్ దృష్టిసారించి జిల్లాలోని రైతుబజారుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్త రైతుబజారుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.