
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు బీసీలను అణగతొక్కి రాజకీయంగా, సామాజికంగా ఎదగనీయకుండా చేశాడని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో ఒకే సామాజిక వర్గం వారికే అధిక ప్రాధాన్యత దక్కుతోందన్నారు. ఇటీవల జరిగిన పోలీస్ ప్రమోషన్లలో ఆ కులానికి చెందిన వారికే దాదాపు 35 మందికి అవకాశం దక్కిందని, దీన్ని కాదని వారించే బదులు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి నిరూపించుకోవాలని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆదాయ వనరులను నాశనం చేసి తను మాత్రం హెరిటేజ్‌లో రూ.కోట్లు ఐటీ రిటర్నులు కడుతున్నాడని విమర్శించారు. అడ్డుచెప్పే బీసీలను అక్రమ కేసులు, బెదిరింపులతో వేధిస్తున్నారన్నారు. లోటు బడ్జెట్ అంటూ చెబుతూనే ప్రచారాలకు వేల కోట్లు ఖర్చు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజలకు ప్రత్యామ్నాయమేంటో తెలుసనని, వారికే ఓటు వేసి గెలిపిస్తారన్నారు. ఏపీలో అన్యాయానికి గురౌతున్న బీసీలను చైతన్య పరచడంలో భాగంగా మార్చి 3న గుంటూరు ఇన్నర్‌రోడ్డు వద్ద యాదవ–బీసీ గర్జన సభను నిర్వహించనున్నామని తలసాని వెల్లడించారు. మంచి నాయకత్వ లక్షణాలున్న బీసీ నేతలకు తాను సహకారం అందించి హక్కుల కోసం చేసే పోరాటంలోనూ అండగా ఉంటానన్నారు. తాను సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చే వరకు బీసీలు గుర్తుకురాలేదని, ఆ తర్వాత హడావిడిగా జయహో బీసీ సభను తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిందన్నారు. మూడు రోజులకొకటి చొప్పున కేబినెట్ మీటింగ్‌లు పెట్టి తాయిలాలు ప్రకటిస్తున్నాడని, అయినా ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
బీసీలకు న్యాయం చేస్తున్నట్టు చెప్పుకోవటానికి బీసీ సబ్‌ప్లాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, అయితే ప్రవేశపెట్టిన మంత్రి, చర్చలో పాల్గొన్న విప్ కూన రవికుమార్‌లకే దానిపై స్పష్టత లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇస్తానని వారిని మరోమారు మోసం చేస్తున్నాడన్నారు. హైదరాబాద్ తానే కట్టానని గొప్పలు చెప్పే మనిషి 5 ఏళ్లుగా ఒక్క ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేకపోయాడని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చని అందుకే చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తాము స్వాగతించామని, ఏపీలో తాను పర్యటిస్తుంటే ఆంక్షలు పెడుతున్నారని, వాటికి భయపడేదిలేదన్నారు.