ఓ ఎలుగుబంటి చెట్కెక్కి కూర్చుంది. దాన్ని కిందకు దింపేందుకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మందస (శ్రీకాకుళం): ఓ ఎలుగుబంటి చెట్కెక్కి కూర్చుంది. దాన్ని కిందకు దింపేందుకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం, చిన్నబిడిమి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కుక్కలు అరుస్తుండడంతో స్థానికులు అటుగా వెళ్లి పరిశీలించారు. కొబ్బరి చెట్టుపై ఎలుగుబంటి కనిపించేసరికి ఉలిక్కిపడ్డారు. తమపై దాడి చేస్తుందనే భయంతో ఎస్‌ఐ వి.రవివర్మతో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
వారంతా హుటాహుటిన చిన్నబిడిమి చేరుకుని, ఎలుగు బంటిని చెట్టు నుంచి దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఉదయం 11 గంటల వరకు ప్రయత్నించి వెళ్లిపోయారు. అగ్ని మాపక సిబ్బందిని పిలిచి ఎలుగు బంటిని పట్టుకునే ప్రయత్నం చేయాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, సాయంత్రం 6 గంటల వరకు ఎలుగు బంటి కిందకు దిగకుండ చెట్టుపైనే ఉండి పోయింది. చెట్టుపై ఉన్న ఎలుగును చూసేందుకు చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. జన సందోహాన్ని చూసి కిందకు దిగడం లేదని, రాత్రి సమయంలో అదే దిగి వెళుతుందని స్థానికులు భావిస్తున్నారు.