గడ్డి భగ్గుమంటోంది..
- పశుగ్రాసానికి పెరిగిన డిమాండ్
- ఎకరా రూ.7 వేలకు చేరిన ఎండుగడ్డి
- పక్క జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పశుపోషకులు
- భారంగా మారిన పశువుల పెంపకం
బాపట్లటౌన్, న్యూస్‌లైన్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పశుపోషకులకు కష్టం వచ్చిపడింది. ఖరీఫ్ సీజన్‌లో వరుసగా వచ్చిన తుఫాన్‌ల కారణంగా పొలాలన్నీ ముంపునకు గురై పైర్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం మండలంలోని రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడింది. గతంలో ఎకరం రూ.1500 నుంచి 2000 ఉండే ఎండుగడ్డి ప్రస్తుతం ఎకరం ఇంటికి చేరా రూ.6500 నుంచి రూ.7000 వరకు ధర పలుకుతోంది. అయినా చేసేది లేక పశుపోషకులు జిల్లాలోని వివిధ మండలాలతో పాటు, పొరుగున ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఎండుగడ్డిని తెచ్చుకోవాల్సి వస్తోంది.
గ్రామాల్లో తగ్గిపోతున్న పశుసంపద
ఒకప్పుడు పశుసంపద, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడేవి. ప్రస్తుతం అతివృష్టి, అనావృష్టిలతో రైతులు నిండా మునిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పశువులను పోషించే స్తోమత లేక ఉన్న పశువులను కూడా కబేళాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా పశువులకు దాణా, తవుడు ధరలు విపరీతంగా పెరగడం, భగ్గుమంటున్న ఎండతీవ్రతకు పొలాల్లో ఎక్కడా పచ్చికమేత లేకపోవడం, ఎండుగడ్డి ధరలు ఆకాశాన్ని అంటడంతో రైతులకు పశుపోషణ భారంగా మారింది. గత రెండు నెలల వ్యవధిలో మండలంలోని జమ్ములపాలెం, కంకటపాలెం, ముత్తాయపాలెం, పిన్నిబోయినవారిపాలెం, గుడిపూడి, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం గ్రామాల నుంచి సుమారు 1000 పశువులను కబేళాకు విక్రయించారు.
భారమైనా తప్పనిసరై కొంటున్నాం...
నెహ్రూనగర్(మాచర్ల): వరి గడ్డి ధర పెరగడంతో పశువుల పెంపకం రైతుకు భారంగా మారింది. నెల క్రితం వరకు రూ.4 వేల నుంచి 4,500 మధ్య నున్న ట్రాక్టర్ వరి గడ్డి ధర ప్రస్తుతం రూ.5,500కు చేరింది. ఎండలు అధికం అవడం, రానున్నది వర్షాకాలం కావడంతో మేత దొరకడం కష్టం. దీంతో వరిగడ్డికి డిమాండ్ వచ్చింది. ఇంత ధర పెట్టి గడ్డి కొని పశువులను పోషిస్తే మిగిలేది ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా తప్పనిసరై ఎక్కువ ధర చెల్లించి గడ్డిని కొని నిల్వ చేసుకుంటున్నారు.