అన్నీ అదే ఖాతాలో వేస్తారా?
* రైతుల ఆత్మహత్యలన్నీ పంటలు ఎండిపోవడం వల్లే జరగడం లేదు: మంత్రి పోచారం
* కుటుంబ కలహాలు, సమస్యలతోనూ ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ సమస్యలు, తగాదాల వల్ల కూడా కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. వాటన్నింటినీ రైతుల ఆత్మహత్యలుగా చూపడం తగదని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అలాగని అప్పు లబాధ, పంటలు ఎండిపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడలేదని తాను అనడం లేదని.. అవన్నీ విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. గురువారం మంత్రి హైదరాబాద్‌లోని ఉద్యానవన శిక్షణ కేంద్రం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘నా నియోజకవర్గంలో గంగారాం అనే రైతు చనిపోయాడు.
కుటుంబ సమస్యల వల్ల చనిపోయాడని అక్కడివారు చెప్పారు. కానీ పంట లు ఎండిపోవడం వల్లే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెల్లారి పేపర్లో వచ్చింది. నా బంధువు ఒకాయన కుటుంబ సమస్యల వల్ల చనిపోతే దాన్ని కూడా పంటలు ఎండిపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇలా అన్నింటినీ రైతు ఆత్మహత్యలుగా చూపడం తగదు. విచారణలోనే అన్నీ బయటపడతాయి..’’ అని పోచారం చెప్పారు. విద్యుత్, నీళ్లు లేకపోవడమే ఆత్మహత్యలకు కారణమైతే.. కాంగ్రెస్, టీడీపీలదే ఆ బాధ్యత అన్నా రు. భవిష్యత్‌లో రైతుల ఆత్మహత్యలు జరగకుండా చేస్తామని, బడ్జెట్లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించామని తెలిపారు.
రూ. 240 కోట్లతో మెగా డెయిరీ..
పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామని మంత్రి తెలి పారు. స్త్రీనిధి, నాబార్డు ద్వారా గేదెలు, ఆవులను అందజేస్తామన్నారు. రూ. 240 కోట్లతో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో మెగా డెయిరీ ఏర్పాటుకోసం కేంద్రానికి ప్రతిపాదన పంపామని చెప్పారు. గొర్రెల పెంపకం కోసం మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 63 కోట్లతో ఒక ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. డెయిరీ రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే అంశం సీఎం పరిశీలనలో ఉందన్నారు.
ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత..
త్వరలో రెగ్యులర్ విధానంలో సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేస్తామని పోచారం వెల్లడించారు. 4,442 పోస్టుల్లో 400 మందిని ఉద్యానవనానికి కేటాయిస్తామని, వారు మండల అధికారులుగా ఉంటారని చెప్పా రు. జిల్లాల్లో చిన్ననీటి పారుదల, ఉద్యానవనా న్ని కలిపి ఒక జేడీఏను కేటాయిస్తామన్నారు. ప్రతీ మండలంలో చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో 50 చోట్ల ఆ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.