వెల్ఫేర్‌బోర్డు మార్చి గ్రీన్‌సిటీగా మార్చిన వ్యాపారులు
- రూ. 7 కోట్ల విక్రయానికి 'వెల్ఫేర్ 'భూములు
- జిల్లాలో 1.5 లక్షల మంది బాధితులు
- బోర్డు తిప్పేందుకు రంగం సిద్ధం
నమ్మకానికి అమ్మవంటిదంటూ ప్రచార మాద్యమాల్లో ఊదరగొట్టిన 'వెల్ఫేర్' సంస్థ. అదే నమ్మకాన్ని అంగట్లో పెట్టి అమ్ముకుంటోంది. అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అక్షిత, అవని గోల్డు వంటి సంస్థలు వేల కోట్లు కొల్ల గొట్టిన సంఘటనలు ఇంకా కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉంటే మరో సంస్థ బోర్డు తిప్పేసేందుకు రంగం సిద్ధం చేసుకొంది. అందులో భాగంగా ఎమ్మిగనూరులో 'వెల్ఫేర్' భూములు రూ. 7 కోట్లకు అమ్మేయటం ప్రకంపనలు సృష్టించింది. నిన్నటి వరకు సంస్థ లేకపోయినా స్థలాలు ఉన్నాయనే భరోసాతో ఉన్న బాధితులు నేడు లబోదిబోమంటున్నారు.
- ఎమ్మిగనూరు
రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా బ్రాంచ్‌లు ఉన్న వెల్ఫేర్ సంస్థ నాలుగేళ్లుగా నగదు లావాదేవీలకు బ్రేకులు వేసింది. రోజుకో వంద చొప్పున నెలకు రూ. 3,000 వంతున ఏడాదిలో రూ. 36,000 కడితే వెల్ఫేర్ సంస్థ ద్వారా ప్లాటు (100 చదరపు గజాలు) రిజిస్ట్రేషన్ చేయించడం, లేకపోతే లబ్ధిదారుడు కట్టిన సొమ్ముకు 10 శాతం ఎక్కువ కలిపి నగదు చెల్లిస్తామంటూ ఏజెంట్లు నమ్మ బలికారు. జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇలా చేరి పొదుపు చేసిన వారి మొత్తమే రూ. 54 కోట్లకు పైబడి అవుతోంది. ఐదేళ్ల కాలపరిమితితో మరో రూ.30 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది. గొలుసు కట్టు కథలో అన్ని కంపెనీలు ఇప్పటికే బోర్డులు తిప్పేసి ఎందరో ఏజెంట్లు, సభ్యుల చావులకు కారణమైతే తాజాగా ఎమ్మిగనూరు సంఘటనతో వెల్ఫేర్ సంస్థపై సభ్యుల నమ్మకం అమ్మకానికి పెట్టేశారు. ఎమ్మిగనూరుకు కూతవేటు దూరంలో కలుగొట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కర్నూలు – బళ్లారి ప్రధాన రహదారి పక్కన ఉన్న 17.50 ఎకరాల భూమి (సర్వే నంబర్లు 172, 174ఎ, 174బీ, 174సీ, 175, 178) వెల్ఫేర్ సంస్థ 2009, 2010లో కొనుగోలు చేసింది. అయితే ఎమ్మిగనూరుకు చెందిన వ్యాపారులు వారం రోజుల క్రితం ఎకరా రూ.42 లక్షల ప్రకారం రూ. 7 కోట్లకు ఈ పొలాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలోని లక్షాయాభైవేల మంది నమ్మకాన్ని వమ్ముచేశారు.
బ్లాక్‌మనీతో కొనుగోలు:
ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వెల్ఫేర్ సంస్థకు చెందిన స్థలాన్ని రూ. 7 కోట్లకు కొనుగోలు చేయటం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం రేపింది. ఆదోనికి చెందిన డాక్టర్ దంపతులు, పార్లపల్లెకు చెందిన దళారి మర్చంట్, డోన్, కోడుమూరుకు చెందిన బడా నేతలు ఈ కొనుగోలు చేపట్టినట్లు తెలుస్తొంది. ఎమ్మిగనూరులోని గాంధీనగర్‌కు చెందిన ఓ దుస్తుల షాపు యజమానీ, గోనెగండ్లకు చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్ వీరందరికీ బినామీలుగా ఉండి వ్యవహారం చక్క బెడుతున్నారు. అయితే వాస్తవానికి వెల్ఫేర్ సంస్థలో చేరిన సభ్యుల కోసం ఆ సంస్థ 2013లోనే ఈ భూములను లే అవుట్ భూములుగా మార్చింది. కలుగొట్ల పంచాయతీలో ఎల్‌పీసీ 138/2013గా కూడా నమోదైంది.
నల్లధనంతో కొనుగోలు చేసిన వ్యక్తులు అప్పుడే వెల్ఫేర్ బోర్డు స్థానంలో గ్రీన్ సిటీగా పేరు మార్చి సెంట్ రూ. 1.20 లక్షలుగా అమ్మకానికి పెట్టారు. వెల్ఫేర్ సభ్యులకు న్యాయం చేసిన తరువాత ఎటువంటి లావాదేవీలైనా జరపాలనీ, ముందుగానే ఇలా అక్రమ పద్ధతుల్లో అమ్ముకోవటంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ భూముల అమ్మకాలను రద్దు చేయాలనీ, లేకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడుతామని వెల్ఫేర్ బాధితులు హెచ్చరిస్తున్నారు.