పెలైట్ పూసపాటి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి పూసపాటి అశోక్‌గజపతిరాజును వరించిం ది. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల మధ్య సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కేంద్రమంత్రిగా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆపదవిని అలంకరించిన రెండో వ్యక్తిగా జిల్లా చరిత్రలో నిలిచారు. పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో అనేక మంత్రి పదవులు చేపట్టిన అశోక్ గజపతిరాజు ఎంపీగా ఎన్నికైన తొలిసారే కేంద్ర మంత్రి పదవిని అధిష్టించి జిల్లాలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. గజపతిరాజుల కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై మధ్యలో ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో పరాజయం చెందినా అంతటితో ఆగిపోలేదు. 2009 ఎన్నికల్లో ఏడోసారి ఎంఎల్‌ఏగా విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా ఎంపీగా ఎన్నిైకై, కేబినెట్ మంత్రై ఢిల్లీ స్థాయికి ఎదిగారు. విజయనగరం గజపతిరాజులు తొలి నుంచి రాజకీయ నేపథ్యం గలవారే. ఆయన తండ్రి పీవీజీ రాజు, తల్లి కుసుమ గజపతి, సోదరుడు అనందగజపతిరాజు అనేక పదవులు అలంకరించిన వారే.
గజపతిరాజుల నేపథ్యం
అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు 1952 నుంచి 67 వరకు ఉప ఎన్నికలతో సహా ఆరు పర్యాయాలు ఓటమెరగకుండా ఎన్నికై చరిత్ర సృష్టించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఎక్కువ కాలం సోషలిస్టుగా రాజకీయాలను నడిపి తుదకు కాంగ్రెస్‌లో చేరారు. సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాల్లో పీవీజీ రాజు మంత్రిగా పనిచేశారు. ఇక, ఆయన తల్లి కుసుమ గజపతిరాజు 1995లో గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అశోక్ సోదరుడు అనందగజపతిరాజు కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికవడమే కాకుండా ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవిని చేపట్టారు. జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అశోక్ ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు. జిల్లాలో అత్యధిక కాలం మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు అశోక్ గజపతిరాజుకే సొంతమైంది. ఇక, ఆయన సతీమణి సునీలా గజపతి విజయనగరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.