
దేశంలో భగ్గుమన్న విభేదాలు
- పలమనేరు పార్టీ ఇన్‌చార్జ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు
- బోస్ ఓటమిపై లోకేష్‌కు వివరాలు
- నాలుగు నెలలుగా అంతర్గత కుమ్ములాటలు
పలమనేరు: పలమనేరు తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుభాష్‌చంద్రబోస్‌పై అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (ఆర్‌ఎస్‌ఆర్) రెండ్రోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు దఫాలు పలమనేరుకు వచ్చిన మంత్రి బొజ్జల కార్యక్రమాలకు సైతం శ్రీనివాసులురెడ్డి వర్గం హాజరుకాలేదు.
పార్టీ కార్యక్రమాల్లో తనను అసలు పట్టించుకోవడం లేదని ఆయన తన ఆవేదనను జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకే మంత్రి పలమనేరుకు వచ్చినట్టు కూడా తెలిసింది. అయిన్పటికీ కొలిక్కి రాకపోవడంతో జిల్లా నాయకులు సైతం ఈ విషయం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమరనాథరెడ్డిపై టీడీపీ నుంచి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఓటమి కారణాలు తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహించింది. బెరైడ్డిపల్లెలో సమావేశం జరిగినపుడు బోస్ ఓ జాబితాను చదివి వీరందరూ తమ వద్ద డబ్బు తీసుకుని పార్టీ కోసం పనిచేయలేదని ద్వితీయ శ్రేణి నాయకులనుద్దేశించి బహిరంగంగానే చెప్పారు. మనస్తాపం చెందిన శ్రీనివాసులురెడ్డి వర్గం అప్పటి నుంచి పార్టీ ఇన్‌చార్జ్ బోస్‌తో ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన పలు పార్టీ కార్యక్రమాలకు శ్రీనివాసులురెడ్డిని బోస్ ఆహ్వానించకపోవడం వీరిద్దరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
అధిష్టానానికి ఫిర్యాదు
బోస్ ఓటమికి గల కారణాలను వదిలిపెట్టి కేవలం తమపైన నిందలేయడం సమంజసం కాదంటూ పార్టీ బెరైడ్డిపల్లె మండలాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కెళ్లి లోకేష్‌ను కలిశారు. అభ్యర్థి ఓటమికి గల వాస్తవ కారణాలను ఆయనకు వివరించినట్టు తెలిసింది. నాలుగు పేజీల నివేదికను సైతం ఆయన సీఎంకు అందజేసినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఈ విషయంపై చర్చ సాగాలనే ఈ తతంగమంతా జరిగినట్టు తెలుస్తోంది.
వక్ఫ్ ఆస్తుల విషయంపై అధికారులకు ఫిర్యాదు
పలమనేరులోని బోస్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.కోట్లాది విలువైన భవనం సైతం వక్ఫ్ ఆస్తులకు సంబంధించిందేననే విషయమై శ్రీనివాసులురెడ్డి వర్గం ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కలెక్టర్ ఉత్తర్వుల కాపీ తదితరాలను ఆ ఫిర్యాదులో జత పరిచి తగు చర్యలు తీసుకోవాలంటూ పేర్కొనట్టు సమాచారం. ఈ భవనాన్ని రక్షించుకోవాలనే ప్రయత్నంలోనే బోస్ పార్టీ కార్యాలయాన్ని ఆ భవనంలోకి మార్చినట్టు ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. ఏదేమైనా అధికార తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు భవిష్యత్తులో ఎంతవరకు వెళ్తాయోననే ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.