సాక్షి, నంద్యాల: గురువారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలోని మంత్రి అఖిలప్రియ నివాసానికి సమీపంలో ఆమె అనుచరులు వీరంగం వేశారు. నడిరోడ్డుపై తల్లీకొడుకులను చితకబాదారు. అందరూ చూస్తుండగానే కాళ్లతో తన్నారు. పట్టణంలోని పద్మావతినగర్‌లో మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన రోడ్డుపై ఓ పేద కుటుంబం చిన్న టీ బంకు పెట్టుకొని జీవనం సాగిస్తోంది.
గురువారం ఈ బంకులో మంత్రి అనుచరులు తమ సామాన్లు పెట్టుకున్నారు. రాత్రి అవుతుండటంతో తాము ఇంటికి వెళ్లాలని, సామాన్లు తీసుకువెళ్లమని బంకు నిర్వాహకురాలు చిన్నయమ్మ, ఆమె కుమారుడు శీను కోరారు. దీంతో మంత్రి అనుచరులు కోపోద్రిక్తులయ్యారు. తాము ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘మాకే ఎదురు చెబుతారా’ అంటూ ఇద్దర్నీ చితకబాదారు. ఆమె కుమారుడి నోటి నుంచి రక్తం పడుతున్నా వదలకుండా కొట్టారు. అరగంట పాటు ఈ దౌర్జన్యకాండ సాగింది. మంత్రి అనుచరులు కావడంతో స్థానికులు అడ్డుకునే సాహసం చేయలేకపోయారు.
పేపర్‌లో రాస్తే మమ్మల్ని చంపేస్తారు: విలేకరులకు జరిగిన సంఘటన గురించి చెప్పడానికి కూడా బాధితులు భయపడ్డారు. ‘మీరు పేపర్‌లో వార్తలు రాస్తే మమ్మల్ని చంపేస్తారు.. రాయొద్దు..’ అంటూ బతిమాలారు. ‘టీలు, సిగరెట్లపై రూ.వెయ్యి, 2 వేలు అప్పులు పెడతారు. వారు ఇచ్చినప్పుడే తీసుకుంటున్నాం. కొన్ని సార్లు అసలు ఇవ్వరు. అయినా మేము ఏనాడూ అడిగింది లేదు. ఈ రోజు ఇంటికి వెళ్లాలి.. సామాన్లు తీసుకోండని చెప్పడం మా తప్పయ్యింది..’ అంటూ రోదించారు. గాయాలైన వారు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే కేసు రాసుకుంటారని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని భూమా అనుచరులు సూచించడంతో బాధితులు వారు చెప్పిన విధంగానే చేయడం వారిలో భయాందోళనలకు నిదర్శనంగా నిలిచింది.
అఖిల ప్రియ అనుచరుల వీరంగం
Published Thu, Oct 26 2017 9:58 PM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment