టీడీపీలో రగడ | Conflicts In Kurnool TDP Party | Sakshi
Sakshi News home page

టీడీపీలో రగడ

Published Mon, Nov 26 2018 2:07 PM | Last Updated on Mon, Nov 26 2018 2:07 PM

Conflicts In Kurnool TDP Party - Sakshi

మంత్రి ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌తో వాగ్వాదం చేస్తున్న సయ్యద్‌హుసేన్‌

కర్నూలు, నంద్యాల: రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి  మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు– కడప జాతీయ రహదారిపై ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలాల వివాదం వీరిమధ్య విభేదాలను మరింతగా పెంచాయి. ఈ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నంద్యాల తాలూకా పోలీసులు టీడీపీ కౌన్సిలర్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు కట్టడంతో భూమా వర్గం భగ్గుమంటోంది. మూడు రోజుల క్రితం మంత్రి ఫరూక్‌ తనయుడు వక్ఫ్‌బోర్డు స్థలాల వద్దకు వెళ్లడంతో అక్కడ స్థానికులు అడ్డుకొని మీరెన్ని భూములు ఆక్రమించారో అందరికీ తెలుసునంటూ పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది.

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ఓవర్‌బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారి పక్కన జామియా మసీదుకు చెందిన సర్వేనెం.278, 231, 236లో వక్ఫ్‌బోర్డు భూములు 75.76ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ సెంటు రూ.5లక్షల నుంచిరూ.8లక్షల వరకు పలుకుతోంది. ఈ భూములను కొందరు ఆక్రమించుకొని కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు ఆపాలని రెండు నెలల క్రితం తహసీల్దార్‌ జయరామిరెడ్డి.. స్థలాల వద్దకు వెళ్లి నిర్మాణ దారులకు తెలియజేశారు. వక్ఫ్‌బోర్డు స్థలాల్లో వేసిన రహదారులను తొలగించి ఈ స్థలాలు వక్ఫ్‌బోర్డుకే చెందినవి, వీటిలో ఎలాంటి కట్టడాలు కట్టవద్ద, ఈ స్థలాలు అమ్మినా... కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఆక్రమణ దారులు ఈ హెచ్చరిక బోర్డులను తొలగించి యథావిధిగా స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు కడుతున్నారు. ఈ నిర్మాణాలు చేస్తున్నది టీడీపీ నాయకులు కావడంతో అధికారులు ఏం చేయలేకపోయారు. 

ఆగ్రహించిన ముస్లిం నాయకులు...
మంత్రి ఫరూక్‌ తనయుడు ఫిరోజ్, మంత్రి ముఖ్య అనుచరుడు అంజాద్‌బాషా రెండు రోజుల క్రితం వక్ఫ్‌బోర్డు స్థలాల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముస్లిం నాయకుడు సయ్యద్‌ హుసేన్‌ మాట్లాడుతూ.. బ్రిటీష్‌ కాలంలో నవాబులు తమ తాతలకు ఈ స్థలం ఇచ్చారని, ఈ స్థలాన్ని తాము ఐదుగురు అన్నదమ్ములం పంచుకున్నామని, వీరికేం సంబంధం ఉందని ప్రశ్నించారు. మంత్రి ఫరూక్‌ అనుచరుడు అంజాద్‌బాషా.. 200ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు నిర్మించారని, అప్పుడు ఆ భూములు వక్ఫ్‌బోర్డుకు చెందినవని, వారికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. మంత్రి ఫరూక్‌ కూడా గతంలో వక్ఫ్‌బోర్డు భూముల్లో కట్టడాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. దీంతో ఫరూక్‌ అనుచరులు, సయ్యద్‌ హుసేన్‌ మధ్య తోపులాట జరిగింది. మంత్రి అనుచరుడు అంజాద్‌బాషా అధికారం ఉందని మంత్రి కుమారుడు ఫిరోజ్‌ను తీసుకొని వచ్చి తనపై దాడికి ప్రయత్నించారన్నారన్నారు. వారు గతంలో వక్ఫ్‌బోర్డు స్థలంలో నిర్మాణాలు కట్టుకుంటే తప్పులేదా అని ప్రశ్నించారు. 

టీడీపీ కౌన్సిలర్‌తో పాటు ఐదుగురిపై కేసు నమోదు... వక్ఫ్‌బోర్డు భూముల్లో కట్టడాలు కట్టవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణ దారులు వాటిని పక్కకు పడేసి నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగించారు. అయినా వారి జోలికి వెళ్లని అధికారులు మంత్రి కుమారుడికి ఎదురు తిరిగారని, వక్ఫ్‌బోర్డు అధికారులతో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించడంపై టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు. వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అల్తాఫ్‌ హుసేన్‌ ఫిర్యాదు మేరకు నూనెపల్లెలో వక్ఫ్‌బోర్డు స్థలాలు ఆక్రమించుకొని కట్టడాలు నిర్మిస్తున్నవారిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. టీడీపీ కౌన్సిలర్‌ కొండారెడ్డితో పాటు భూమా రాఘవరెడ్డి, క్రాంతికుమార్, వీరన్న, హరిబాబు, పరుచూరి శ్రీరాములుపై సెక్షన్‌ 447కింద కేసు నమోదు చేశామన్నారు.  

అసంతృప్తిలో భూమా వర్గం
తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి పని చేసిన తమపై కేసు నమోదు చేయడం పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి చెందిన టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  కేసు మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని ఓ కౌన్సిలర్‌ తెలిపినట్లు సమాచారం. నంద్యాలలో ఇంత వరకు స్తబ్దతగా ఉన్న ఫరూక్‌ వర్గీయులు కార్యాలయాల్లో అధికారులపై పెత్తనం చెలాయిస్తుండటంతో ఎమ్మెల్యే వర్గం డీలా పడుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement