నోట్ల రద్దులో శాస్త్రీయత లేదంటూ భూమన నిరసన
నోట్ల రద్దులో శాస్త్రీయత లేదు: భూమన
Published Tue, Nov 15 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
తిరుపతి : పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు, చిన్ననోట్ల కొరతను నిరసిస్తూ ఆయన మంగళవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేంద్రం సదుద్దేశంతో నిర్ణయం తీసుకున్నా... అందులో శాస్త్రీయత లేదని అన్నారు.
ప్రజల ఇబ్బందులపై తాము స్పందించాల్సి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ జనాల ఊపిరి తీసేశారని భూమన వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం సామాన్యులు నడిరోడ్డుపై పడిగాపులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తిప్పలు గుర్తించకుండా ....తాను వదిలిన బాణం నల్లకుబేరుల గుండెల్లో దిగి వాళ్లు నిద్రపోవడం లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లు వేసి గెలిపించినవారు ...నోట్ల కోసం వీధుల్లోకి వచ్చారని భూమన అన్నారు.
పెద్ద నోట్ల రద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న భారత జాతికి వెల్లడిస్తే...మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం మూడు నెలల ముందే సమాచారం అందిందని భూమన విమర్శించారు. సీఎం,ఆయన అనుయాయులు ఈ మూడు నెలల్లో ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల భూములను కొని, లక్షల కోట్ల రూపాయిల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారని భూమన ప్రశ్నించారు.
మరోవైపు భూమన నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో భూమన అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న భూమనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Advertisement