హవాలా....హవాలా...నోట్ల హవాలా... | hawala for black money | Sakshi
Sakshi News home page

హవాలా....హవాలా...నోట్ల హవాలా...

Published Fri, Nov 11 2016 2:40 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

హవాలా....హవాలా...నోట్ల హవాలా... - Sakshi

హవాలా....హవాలా...నోట్ల హవాలా...

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం నాడు అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని ఆయన మద్దతుదారులు ‘సర్జికల్‌ స్రై్టక్స్‌’గా అభివర్ణించారు. చాలా మంది ప్రజలు అవును కాబోలు అనుకున్నారు. పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టుల శిబిరాలపై జరిపిన సర్జికల్‌ దాడులు సరైన లక్ష్యం, సరైన సమయంలో, సరైన రీతిలో జరిగిన దాడులే కావచ్చు. అనూహ్యంగా ఈ నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేయడంలో మాత్రం సరైన లక్ష్యం, సరైన సమయం, సరైన రీతి మూడు తప్పేనని రెండు రోజుల్లోనే తేలిపోయింది.

‘దో దిన్‌ రుక్‌ జాయే హవాలా రేట్స్‌ హాజాయింగే’ ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు నిజమవుతోంది. రేట్లు ఇప్పటికీ బయటకు రాలేదుగానీ హవాలా దళారులు మాత్రం బయటకు వచ్చారు. 20 శాతం కమిషన్‌పై నల్ల కుబేరులు బొక్కల్లో దాచిన బోషాణంలోనుంచి తీసిస్తే వాటిని ప్రభుత్వం కళ్లుగప్పి తెల్లబజారులోకి తేట తెల్లగా తెస్తామని చెబుతున్నారు. బ్యాంకుల్లో రెండున్నర లక్షలకు మించి నిషేధించిన నోట్లను డిపాజిన్‌ చేస్తే వారిపై నిఘా వేసి ఆ డబ్బు కూపీలు లాగుతామని, నల్లడబ్బని తెలిసినా, చూపిన సోర్స్‌కు టాలీ కాకపోయినా పన్నుతోపాటు రెండు వందల రెట్లు జరిమానా విధిస్తామని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ ఆదియా స్వయంగా ప్రకటించి హవాలా దందాకు తలుపులు బార్లా తెరిచారు.


రెండున్నర లక్షలకు పైగా డిపాజిట్‌ చేసే ఖాతాదారుల వివరాలన్నింటిని పరిశీలించే శక్తి సామర్ధ్యాలు, తగిన సిబ్బంది ఆదాయం పన్ను శాఖకు ఉందా అన్న సందేహం తప్పకుండా వస్తోంది. రెండున్నర లక్షల డిపాజిట్‌దారుల జోలికి వెళ్లమని పరోక్షంగా ఆదిలోనే చెప్పగా, ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ మరింత గట్టిగా ధ్రువీకరించారు. లక్షల సంగతి దేవుడెరుగు బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌కు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువలేని వారు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారిలో వీలైనంత మందికి పదో, పరకో ఇచ్చి నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చేందుకు హవాలాదారులే కాకుండా బ్యాంక్‌ దళారులు కూడా కాచుకొని కూర్చున్నారు.

ఎంత డబ్బయినా నిషేధించిన నోట్ల రూపంలో తీసుకుంటామని, బంగారం కొంటే చాలంటూ బంగారు షాపుల యజమానులు, వస్త్రవ్యాపారులు, జిమ్‌లు, సెలూన్లు, క్లబ్బులు సరికొత్త ఆఫర్లతో ముందుకు రావడం వెనకనున్న ఆంతర్యం ఏమిటో ప్రభుత్వానికి అవగాహన ఉందా? తులం బంగారాన్ని యాభై వేల రూపాయలకు అమ్ముతున్నారంటే నల్లడబ్బుకు తెల్లవన్నె తెచ్చే విద్య వారికేదో తెలిసే ఉంటుందికదా? నోట్ల నిషేధ నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే ఎలా తెల్సిందంటూ ప్రతిపక్షం ప్రశ్నించదంటే అర్థం ఏమిటీ?

బడా బాబులు ముందే ఈ విషయాన్ని తెలుసుకొని ఈపాటికే నల్లడబ్బును సర్దేసుకొని ఉండరా, అచ్చం ఇలాంటి వారికోసమే మోదీ ప్రభుత్వం వెయ్యి నోటు స్థానంలో రెండు వేల నోటును తెచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ చేసిన విమర్శల్లో నిజం లేదంటారా? దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు బారులు తీరిన జనాల్లో ఒక్క నల్ల కుబేరుడన్నా కనిపించారా? దొడ్డితోవ హవాలా మార్గాలు తలుపులు తెరచి ఉండగా వారెందుకు బ్యాంకుల వద్దకు వస్తారు? ఏదేమైనా మోదీ గారు అధికారికంగా యాభై రోజుల పాటు హవాలా మార్గాన్ని రాజమార్గం చేశారని పలు వర్గాల వారు విమర్శిస్తున్నారు. విదేశీ కరెన్సీనే అధికారుల కళ్లుగప్పి చేరాల్సిన చోటుకు చేర్చే హవాలాదారులకు దేశీయ నోట్లను మార్చడం పెద్ద కష్టమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement