
సాక్షి, విజయవాడ : నగరంలోని భవానీపురంలో అర్దరాత్రి అల్లరిమూకలు బీభత్సం సృష్టించాయి. తమ బైక్‌లకు దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్సుపై పోకిరీలు దాడికి పాల్పడ్డారు. బైకులపై బస్సును వెంబడించిన 50 మందికి పైగా యువకులు గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు డ్రైవర్‌ను చితకబాదడంతో పాటు, కండక్టర్ వద్ద నుంచి 25 వేల రూపాయలు లాకెళ్లారు. ఈ చర్యతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై బస్సు డ్రైవర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. బస్సులోని ప్రమాణికులు తీసిన వీడియోల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోకిరీల దాడిలో గాయపడ్డ డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.