సాధారణ కుటుంబంలో జన్మించి.. ప్రముఖ వైద్యుడిగా ఎదిగి.. ప్రతిష్టాత్మకమైన ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించి.. ప్రసిద్ధ ‘బర్డ్’ ఆస్పత్రికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు డాక్డర్ మదన్‌మోహన్‌రెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయన సొంతం. పేదల సేవే పరమాత్ముడి సేవగా భావించడం ఆయన నైజం. ఆయన తన అనుభవాలను సోమవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
సాక్షి ప్రతినిధి, చెన్నై : ‘మనదేశంలో అనేక ఆసుపత్రులున్నాయి. అయితే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందుబాటులోకి రావాలి. ఆసియా ఖండంలోనే అత్యున్నత వైద్యం అందించేలా ‘బర్డ్’ను తీర్చిదిద్దండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ ఎంతైనా ఫర్వాలేదు. నేను చూసుకుంటా. రోగులకు మెరుగైన సేవలు అందించండి అంటూ భరోసా ఇచ్చారు. ఆ మేరకు పనిచేస్తా.
కుటుంబ నేపథ్యం..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన మునమాల రామిరెడ్డి, రామసుబ్బమ్మ దంపతుల కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి. వారిది వ్యవసాయ కుటుంబం. కలువాయిలో పదో తరగతి, నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఎంఎస్ ఆర్థోపెడిక్ కూడా 1992లో అక్కడే పూర్తిచేసి వెంటనే చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో వైద్యుడిగా చేరారు. పుదుచ్చేరికి చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ సమీరాతో అదే ఏడాది వివాహం జరిగింది. 1994లో ఆర్థోపెడిక్ సర్జన్ (జూనియర్ కన్సల్టెంట్)గా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. 1995లో ఫ్రాన్స్‌లో ఫెలోషిప్, 1997లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఆయన ఎడిన్‌బరో మెడికల్ యూనివర్సిటీలో 1999లో ఎఫ్‌ఆర్‌సీఎస్ డిగ్రీ అందుకున్నారు. 2000వ సంవత్సరంలో మళ్లీ చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, ముఖ్యంగా మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడిగా చేరారు. ఇప్పటి వరకు ఆయన 8000 మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు వైద్యంలో మెలకువలు నేర్పిన బర్డ్ ఆసుపత్రికే ఇప్పుడు డైరెక్టర్‌గా నియమితుయ్యారు.
సీఎం సంకల్పం.. నా కార్యాచరణ..
బర్డ్ ఆసుపత్రి ద్వారా పేదలకు అత్యున్నతమైన వైద్యసేవలు ఉచితంగా అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంకల్పం. ఆయన సంకల్పానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. దేశంలోనే చారిత్రాత్మక సేవలు అందించే ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని నేను హామీ ఇచ్చినపుడు.. ఆసియా ఖండంలోనే అతిగొప్ప ఆస్పత్రిగా బర్డ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్‌తో నిమిత్తంలేదు. రోగులందరికీ ఉన్నతమైన వైద్య సేవలు అందేలా చూసుకోండని స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రోత్సాహం మేరకు ‘రోబోటిక్ అసిస్టెంట్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం’ అనే వైద్యసేవను ప్రవేశపెట్టాలని సంకల్పించాను. ఆపరేషన్ చేసుకున్నవారు మరొకరిపై ఆధారపడకుండా అవసరమైన శక్తి సామర్థ్యాలను రోబోటిక్ కల్పిస్తుంది. రోగి అవసరాన్నిబట్టి ఒక ప్రోగ్రాం సెట్ చేస్తే ఫిజియోథెరపీగా పనిచేస్తుంది. మానిటర్‌పై రోబోటిక్ థెరపీని రోగి గమనించుకుంటూ అనుకూలంగా తానే మార్చుకోవచ్చు. ఆసియా ఖండంలో కేవలం థైవాన్, సింగపూర్‌లో మాత్రమే రోబోటిక్ వైద్య విధానం అందుబాటులో ఉంది. ఈ విధానాన్ని బర్డ్ ఆస్పత్రిలో కూడా ప్రవేశపెట్టాలనే నా ఆలోచనకు టీటీడీ బోర్డు కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాను. 15 ఆపరేషన్ థియేటర్లు, 400 పడకలు గల బర్డ్ ఆస్పత్రికి రోజుకు కనీసం 600 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వీరందరికీ మెరుగైన సేవల కోసం బర్డ్ ఆసుపత్రిలో క్రమశిక్షణ, నిర్మాణాత్మకమైన ఒక వ్యవస్థ రూపకల్పనపై ముందుగా దృష్టిసారిస్తా. మానవసేవే మాధవ సేవగా విధులను నిర్వర్తిస్తా. చెన్నై అపోలో ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తూనే బర్డ్ ఆస్పత్రి రోగుల అవసరాన్ని బట్టి ఎన్నిరోజులైనా తిరుపతిలో అందుబాటులో ఉంటాను. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా నియమించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు.
డాక్టర్ వ్యాగ్రేశ్వరుడే నాకు స్పూర్తి..
వైద్య విద్యలో పీజీ చేసే సమయంలోనే బర్డ్ ఆస్పత్రితో అనుబంధం ఏర్పడింది. బర్డ్ రూపకర్త డాక్టర్ వ్యాగ్రేశ్వరుడు ఆనాడు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన. ఆయన హయాంలో పోలియో బాధితులను వైద్యచికిత్సలతో అనేక విధాలుగా ఆదుకున్నారు. పోలియో సోకిన వారికోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి ఉంటే బాగుంటుందని ఆలోచించి బర్డ్ స్థాపనకు ప్రధాన కారకులయ్యారు. బర్డ్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా అనేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పోలియో బాధితులకు విశేష సేవలందించారు. రోగి నడకతీరును బట్టే వ్యాధి తీవ్రతను నిర్ధారించగల గొప్ప నైపుణ్యం ఆయన సొంతం. పోలియో బాధితుల కోసం జైపూర్ కాళ్లను తెప్పించి రోగులకు అమర్చేవారు. ఆర్థోపెడిక్ సర్జన్‌గా ఆయనే నాకు స్ఫూర్తి. 1990–92లో పీజీ విద్యార్థిగా ఆయన వద్ద పనిచేయడం నా జీవితంలో మరిచిపోలేని అద్భుత ఘట్టం.
Comments
Please login to add a commentAdd a comment