Bird Hospital
-
ఉచితంగా ఆపరేషన్లు చేస్తోన్న తిరుపతి బర్డ్ ఆస్పత్రి
-
తిరుపతి ‘బర్డ్’లో విజిలెన్స్ దాడులు
సాక్షి, తిరుపతి: టీటీడీకి చెందిన బర్డ్ ఆసుపత్రిలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆసుపత్రిలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. బర్డ్ డైరెక్టర్ జగదీష్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు నేపథ్యంలో విజిలెన్స్ డిఎస్పీ మల్లీశ్వర్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వైద్య పరికరాల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని.. ఓ సంస్థకు మేలు చేకూరేలా కొనుగోళ్లు జరిపారనే ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగార్చేలా ఇక్కడ పరిణామాలు జరుగుతున్నాయని, 2015 నుంచి జరిగిన కొనుగోళ్లపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని మల్లీశ్వర్ రెడ్డి వెల్లడించారు. -
ది బెస్ట్‌గా బర్డ్
సాధారణ కుటుంబంలో జన్మించి.. ప్రముఖ వైద్యుడిగా ఎదిగి.. ప్రతిష్టాత్మకమైన ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించి.. ప్రసిద్ధ ‘బర్డ్’ ఆస్పత్రికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు డాక్డర్ మదన్‌మోహన్‌రెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయన సొంతం. పేదల సేవే పరమాత్ముడి సేవగా భావించడం ఆయన నైజం. ఆయన తన అనుభవాలను సోమవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. సాక్షి ప్రతినిధి, చెన్నై : ‘మనదేశంలో అనేక ఆసుపత్రులున్నాయి. అయితే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందుబాటులోకి రావాలి. ఆసియా ఖండంలోనే అత్యున్నత వైద్యం అందించేలా ‘బర్డ్’ను తీర్చిదిద్దండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బడ్జెట్ ఎంతైనా ఫర్వాలేదు. నేను చూసుకుంటా. రోగులకు మెరుగైన సేవలు అందించండి అంటూ భరోసా ఇచ్చారు. ఆ మేరకు పనిచేస్తా. కుటుంబ నేపథ్యం.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన మునమాల రామిరెడ్డి, రామసుబ్బమ్మ దంపతుల కుమారుడు మదన్‌మోహన్‌రెడ్డి. వారిది వ్యవసాయ కుటుంబం. కలువాయిలో పదో తరగతి, నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఎంఎస్ ఆర్థోపెడిక్ కూడా 1992లో అక్కడే పూర్తిచేసి వెంటనే చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో వైద్యుడిగా చేరారు. పుదుచ్చేరికి చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ సమీరాతో అదే ఏడాది వివాహం జరిగింది. 1994లో ఆర్థోపెడిక్ సర్జన్ (జూనియర్ కన్సల్టెంట్)గా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. 1995లో ఫ్రాన్స్‌లో ఫెలోషిప్, 1997లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఆయన ఎడిన్‌బరో మెడికల్ యూనివర్సిటీలో 1999లో ఎఫ్ఆర్సీఎస్ డిగ్రీ అందుకున్నారు. 2000వ సంవత్సరంలో మళ్లీ చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, ముఖ్యంగా మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడిగా చేరారు. ఇప్పటి వరకు ఆయన 8000 మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు వైద్యంలో మెలకువలు నేర్పిన బర్డ్ ఆసుపత్రికే ఇప్పుడు డైరెక్టర్‌గా నియమితుయ్యారు. సీఎం సంకల్పం.. నా కార్యాచరణ.. బర్డ్ ఆసుపత్రి ద్వారా పేదలకు అత్యున్నతమైన వైద్యసేవలు ఉచితంగా అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. ఆయన సంకల్పానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. దేశంలోనే చారిత్రాత్మక సేవలు అందించే ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని నేను హామీ ఇచ్చినపుడు.. ఆసియా ఖండంలోనే అతిగొప్ప ఆస్పత్రిగా బర్డ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్‌తో నిమిత్తంలేదు. రోగులందరికీ ఉన్నతమైన వైద్య సేవలు అందేలా చూసుకోండని స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రోత్సాహం మేరకు ‘రోబోటిక్ అసిస్టెంట్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం’ అనే వైద్యసేవను ప్రవేశపెట్టాలని సంకల్పించాను. ఆపరేషన్ చేసుకున్నవారు మరొకరిపై ఆధారపడకుండా అవసరమైన శక్తి సామర్థ్యాలను రోబోటిక్ కల్పిస్తుంది. రోగి అవసరాన్నిబట్టి ఒక ప్రోగ్రాం సెట్ చేస్తే ఫిజియోథెరపీగా పనిచేస్తుంది. మానిటర్‌పై రోబోటిక్ థెరపీని రోగి గమనించుకుంటూ అనుకూలంగా తానే మార్చుకోవచ్చు. ఆసియా ఖండంలో కేవలం థైవాన్, సింగపూర్‌లో మాత్రమే రోబోటిక్ వైద్య విధానం అందుబాటులో ఉంది. ఈ విధానాన్ని బర్డ్ ఆస్పత్రిలో కూడా ప్రవేశపెట్టాలనే నా ఆలోచనకు టీటీడీ బోర్డు కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాను. 15 ఆపరేషన్ థియేటర్లు, 400 పడకలు గల బర్డ్ ఆస్పత్రికి రోజుకు కనీసం 600 మంది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వీరందరికీ మెరుగైన సేవల కోసం బర్డ్ ఆసుపత్రిలో క్రమశిక్షణ, నిర్మాణాత్మకమైన ఒక వ్యవస్థ రూపకల్పనపై ముందుగా దృష్టిసారిస్తా. మానవసేవే మాధవ సేవగా విధులను నిర్వర్తిస్తా. చెన్నై అపోలో ఆస్పత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తూనే బర్డ్ ఆస్పత్రి రోగుల అవసరాన్ని బట్టి ఎన్నిరోజులైనా తిరుపతిలో అందుబాటులో ఉంటాను. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా నియమించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు. డాక్టర్ వ్యాగ్రేశ్వరుడే నాకు స్పూర్తి.. వైద్య విద్యలో పీజీ చేసే సమయంలోనే బర్డ్ ఆస్పత్రితో అనుబంధం ఏర్పడింది. బర్డ్ రూపకర్త డాక్టర్ వ్యాగ్రేశ్వరుడు ఆనాడు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన. ఆయన హయాంలో పోలియో బాధితులను వైద్యచికిత్సలతో అనేక విధాలుగా ఆదుకున్నారు. పోలియో సోకిన వారికోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి ఉంటే బాగుంటుందని ఆలోచించి బర్డ్ స్థాపనకు ప్రధాన కారకులయ్యారు. బర్డ్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా అనేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పోలియో బాధితులకు విశేష సేవలందించారు. రోగి నడకతీరును బట్టే వ్యాధి తీవ్రతను నిర్ధారించగల గొప్ప నైపుణ్యం ఆయన సొంతం. పోలియో బాధితుల కోసం జైపూర్ కాళ్లను తెప్పించి రోగులకు అమర్చేవారు. ఆర్థోపెడిక్ సర్జన్‌గా ఆయనే నాకు స్ఫూర్తి. 1990–92లో పీజీ విద్యార్థిగా ఆయన వద్ద పనిచేయడం నా జీవితంలో మరిచిపోలేని అద్భుత ఘట్టం. -
నడిపించే మనసు
కొన్ని మనసులు కదలవు. మెదలవు.కొన్ని మాత్రం ఎదుటివారి చిన్న కష్టానికి కదిలిపోతాయి. కదిలే మనసుకు సమాజాన్ని కదిలించే శక్తి ఉంటుంది. డాక్టర్ రమణ యశస్వి మనసులో కదలిక ఉంది. అందుకే అది కదల్లేని వారి కోసం తపన పడుతుంది. అవిటితనం శరీరం కంటే ముందు మనసును అవిటిని చేస్తుంది. రమణ యశస్విలాంటి వాళ్లు ఉంటే మొదట మనసులు కదులుతాయి. తర్వాత కాళ్లు కదులుతాయి. ఆగిపోయిన జీవితాలను నడిపించ గలిగే డాక్టర్‌ను కలవండి. నా పేరు రమణ. మాది గుంటూరు జిల్లా గణపవరం. నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. గణపవరం సిఆర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. మా వూళ్లో మా నాన్నగారి మిత్రులంతా డాక్టర్లు కావడంతో, ఆయన నన్ను డాక్టర్ చదివించాలనుకుని, నా చేత ఎంసెట్ రాయించారు. ఫ్రీ సీట్ వచ్చింది. ఆంధ్రా మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశాను. ఆ తరవాత ఎంఎస్ (ఆర్థో) పూర్తి చేశాను. మార్గం చూపిన బర్డ్.... చదువు పూర్తయిన కొత్తల్లో తిరుపతిలోని బర్డ్ (బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్, రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్) ఆసుపత్రి, ఆర్టిఫీషియల్ లింబ్ ఫిట్టింగ్ సెంటర్లో మూడు సంవత్సరాలు సేవ చేశాను. సేవ అని ఎందుకంటున్నానంటే అక్కడ మాకు జీతం ఎక్కువగా ఉండదు. పూర్తిగా స్వామి వారి సేవగా భావించాలి. ఆ ఆసుపత్రిలో అందరికీ ఉచితంగానే చికిత్స చేస్తారు. తితిదే వారి ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రి అది. అక్కడికి కృత్రిమ కాళ్ల కోసం వేల మంది వచ్చేవారు. ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు. నిరంతరం వచ్చిపోయే రోగులతో అక్కడి పనివారు విసుగెత్తిపోయి ‘మూడు నెలల తరవాత రండి, ఆరు నెలల తరవాత రండి’ అంటూ వచ్చినవాళ్లని పంపేస్తూ ఉండేవారు. వారి తప్పు కూడా లేదు. అక్కడకు వచ్చేవారి సంఖ్య అలా ఉండేది. ఆ సమయంలోనే ఒకసారి ‘బర్డ్’ తరఫున ఇతర డాక్టర్లతో కలిసి కలకత్తాలో కృత్రిమ కాళ్లు అమర్చే హెల్త్ క్యాంప్‌కు హాజరయ్యి చాలామందికి కాళ్లు అమర్చాము. ఆ క్యాంప్‌కు మదర్ థెరిస్సా హాజరయ్యి ఆశీర్వదించడం ‘ఇలాగే సేవ చేస్తూ ఉండండి’ అని పలకడం మర్చిపోలేదు. అప్పుడే అనుకున్నాను ‘నేను కూడా ఇటువంటి కేంద్రం నెలకొల్పాలి’ అని. దేశంలో ఎవరికి కృత్రిమ కాలు కావాలన్నా జైపూర్, తిరుపతి వంటి ప్రదేశాలకు వెళ్లవలసి వస్తోంది. నేను నా స్వస్థలంలో నెలకొల్పితే కనీసం ఈ చుట్టుపక్కల వాళ్లకైనా ఉపయోగపడతాను కదా అనుకున్నాను. ఆ ఆలోచన నుంచి వచ్చినదే ఈ ‘వాక్’ సంస్థ. మరచిపోలేను... కాళ్లు పోగొట్టుకున్నవారు ఎదుర్కొనే సమస్యలు కూడా ‘వాక్’ సంస్థ ఆవిర్భావానికి ఒక కారణం. ఒకసారి ఒక పేషెంటుకు ఆపరేషన్ చేసి కాలు తీయాల్సి వచ్చింది. సర్జరీ పూర్తి చేసి డిశ్చార్జ్ చేశాం. ఆ తరవాత కొన్ని సంవత్సరాలకి రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించాడు. అతడు గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కాలు పోగొట్టుకోవడంతో అతడి ఉద్యోగమూ పోయింది. ఇప్పుడు కుటుంబమూ వెలి వేసింది. అతడిని నా దగ్గరకు తీసుకువచ్చి ఉచితంగా కాలు ఇచ్చి, అతడి కాళ్ల మీద అతడు నిలబడేలా అతడికి దారి చూపించి పంపాను. ఇప్పుడు అతడు షాపు పెట్టుకుని ఎంతో గౌరవప్రదంగా, హాయిగా జీవిస్తున్నాడు. మరోసారి గుంటూరు ఎఎంజి పాఠశాలలో ఒక అమ్మాయిని చూసి నా మనసు కరిగిపోయింది. ఆ అమ్మాయి కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన కారణంగా తల్లి ఆమెను అక్కడ విడిచివెళ్లిపోయింది. ఆ పాఠశాల వారే ఆ అమ్మాయిని పెంచుతున్నారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 16 సంవత్సరాలు. పేరు స్టెల్లా. లక్షరూపాయల ఖర్చుతో ఆమెకు రెండు కాళ్లు, ఒక చేయి ఏర్పాటుచేశాం. చేతికి స్పామ్ లాంటిది వేయడం వల్ల ఆమె చేయి కేవలం అంగుళం మేర పెరిగింది. ఆ అమ్మాయి కళ్లల్లో కనిపించిన సంతోషాన్ని మర్చిపోలేను. అప్పటికే మా సంస్థ ద్వారా సుమారు వందమందికి కృత్రిమ కాళ్లు నేనే స్వయంగా కొని, ఉచితంగా పంపిణీ చేశాను. ఆయన చలవే... నేను సేవా కార్యక్రమాలు చేయడం చూసిన ఒక పెద్ద మనిషి, కృత్రిమకాళ్లు తయారుచేయడానికి కావలసిన యంత్రసామగ్రిని మాకు ఉచితంగా అందచేశారు. 2006లో గుంటూరు బ్రాడీపేటలో ప్రారంభమైన మా ‘వాక్’ సంస్థ, ఇప్పుడు గుంటూరులోని కాకాని రోడ్డులో మా సొంత స్థలంలో ఉంది. ఇప్పటివరకు సుమారు నాలుగు వేల మందికి కృత్రిమ కాళ్లు ఉచితంగా అందచేశాం. మా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్లకే కాకుండా, బయట సర్జరీ చేయించుకున్న వాళ్లకు కూడా ఈ కాళ్లు పంపిణీ చేస్తున్నాం. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ హెచ్డి పైపులను తీసుకువచ్చి, వాటితో ఈ కాళ్లు తయారుచేస్తాం. పాదాలు మాత్రం జైపూర్ నుంచే కొనుగోలు చేస్తాం. అది వారి పేటెంట్. పేదల కోసం... మా సేవలన్నీ పేదలకు మాత్రమే. పేదలకు కేవలం కాళ్లు ఇచ్చి వదిలేయడం కాకుండా, కాలికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మా దగ్గరకు రమ్మని చెప్పి పంపుతాం. అంతేకాదు, వారికి ఏదో ఒక దారి కూడా చూపుతున్నాం. సాఫ్ట్ టాయ్స్ తయారీ, అగరువత్తుల తయారీ, టైలరింగ్ వంటివి నేర్పుతున్నాం. కృత్రిమ చేతులు మాత్రం పనిచేయవు. కేవలం చేతితో గ్లాసు పట్టుకునేలా మాత్రం చేయగలం. అంతవరకే. చేతి దగ్గర ఒక బటన్‌లాంటిది నొక్కితే గ్లాసు పట్టుకుని నీళ్లు తాగగలుగుతారు. చేయూతనివ్వండి... ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడవాలంటే ఎంతోమంది దాతలు ముందుకు రావాలి. ఒక్కరితో అయ్యే పని కాదు. మేం చేస్తున్నది మంచి పనే అయినా, మాకు అనుకున్నంత సహకారం అందట్లేదు. అడపాదడపా కొందరు దాతలు సహాయం చేస్తున్నారు. మా సేవ నిరంతర ప్రక్రియ. ఇందుకోసం ఎందరు ముందుకు వచ్చినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. మాకు రెండు మూడు సంవత్సరాలుగా చందాల కొరత ఏర్పడింది. ఇటువంటి సంస్థలను ఆదరించి, ఆర్థికంగా చేయూతనిస్తే మరిన్ని సేవాకార్యక్రమాలు చేయగలుగుతాం. - సంభాషణ: డా.పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఆ ఆనందానికి గుర్తుగా, లేదంటే గతించినవారి జ్ఞాపకార్థం చందాలు ఇవ్వమని కోరుతోంది వాక్ సంస్థ. మీ ప్రతి చందా ఒకరిని నడిపిస్తుంది. ఒక్కో కృత్రిమ అవయవానికి నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు, ట్రైసైకిల్ ఇవ్వాలంటే రూ. 5500 ఖర్చ వుతుంది. అవి అవసరమైనవారికి దాతలు నేరుగా ఇవ్వొచ్చు. - డాక్టర్ రమణ యశస్వి వాక్ ఫౌండేషన్, గుంటూరు. ఫోన్: 99484 94667