ఫొటోలు తీశారని ఆమె ఆరోపిస్తున్న ప్రాంతం ఇదే. దీని ఎత్తు 12 అడుగులు. కిటీకీపై ఓవైపు గాజు పెంకులు. మరోవైపు ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇక్కడి నుంచి ఫొటోలు తీయడం సాధ్యమేనా?, డాక్టర్ అనితారాణి
చిత్తూరు అర్బన్: డాక్టర్ అనితారాణి. ప్రస్తుతం ఈమె పేరు తెలియనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ఈ ఏడాది మార్చి 22న చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి, ఈమెకు మధ్య వివాదం మొదలయ్యింది. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులపై పెనుమూరు పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. కానీ గత ఆరు రోజుల్లో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. తన కేసు సీబీఐకి ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఐడీ ఎస్పీ రత్నపై అట్రాసిటీ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నిజమేనా? ఇందులో వాస్తవాలేమిటని చూస్తే అసలు విషయం అర్థమైపోతుంది. (అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..)
అనితారాణి ఆరోపణలు
♦ మార్చి 22వ తేదీన వైద్యం కోసం వచ్చిన భరత్ తదితరులు తనపై దాడి యత్నం చేశారని పేర్కొన్నారు.
♦ ఓ గదిలో తనను నిర్బంధించారని ఆరోపించారు.
♦ గదిలోంచి బాత్‌రూమ్‌లోకి వెళ్లగా కిటికీలోంచి ఫొటోలు, వీడియోలు తీశారని వాపోయారు.
♦ ఫిర్యాదు చేయడానికి ఉదయం స్టేషన్‌కు వెళితే రాత్రి వరకు కేసు నమోదుచేయకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారనేది ఆమె వాదన.
♦ పెనుమూరులో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని, అబార్షన్లు చేయలంటూ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణ.
♦ ఇక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సిబ్బంది సరిగా విధులకు రాకుండా హాజరు మాత్రం వేసుకుంటున్నట్లు విసుర్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే పోలీసులు నిరాకరించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపణ.
♦ సీఐడీపై తనకు నమ్మకం లేదని, వాళ్ల విచారణకు సహకరించేది లేదని స్పష్టం చేశారు.
♦ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్త్‌రఫ్ చేసి, కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్.
వాస్తవాలు
♦ పెనుమూరుకు చెందిన భరత్‌కుమార్‌కు మార్చి 22వ తేదీన కంట్లో యాసిడ్‌లాంటి ద్రావణం పడితే వైద్యం కోసం పీహెచ్‌సీకి వెళ్లారు. కరోనా నేపథ్యంలో తాను ఎవరికీ వైద్యం చేయబోనంటూ అనితారాణి చెప్పడం, ఆస్పత్రిలోనే ఓ నోటీసును అతికించడం వాస్తవం.
♦ భరత్‌కుమార్‌తో పాటు వచ్చిన గ్రామస్తులు అనితారాణి వాదనపై నిలదీశారు. దీంతో ఆమె తన గదిలోకి వెళ్లి లోపల గడియపెట్టుకున్నారు. ఎవరూ కూడా నిర్బంధించలేదు.
♦ అనితారాణి చెబుతున్నట్లు ఆస్పత్రి మరుగుదొడ్లో ఉంటే ఫొటోలు తీయడం అసాధ్యం. ఎందుకంటే మరుగుదొడ్డికి వెనుక 12 అడుగుల ఎత్తులో ఎగ్జాస్టర్ ఫ్యాన్‌ను ఏర్పాటుచేశారు. అంతపైకి ఎక్కి ఫొటోలు ఎలా తీస్తారని సీఐడీ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేశారు.
♦ పోలీస్ స్టేషన్‌కు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లిన అనితారాణి ఆమె ఫిర్యాదును రాసివ్వగా పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు. కానీ ఎఫ్‌ఐఆర్ ఇచ్చేంతవరకు వెళ్లబోనని ఆమె స్టేషన్‌లోనే కూర్చుకున్నారు. మధ్యలో ఎఫ్‌ఐఆర్ ఆన్‌లైన్ చేసేప్పుడు సర్వర్ పనిచేయలేదు. దీంతో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ జారీ చేశారు.
♦ పెనుమూరులో అబార్షన్లు ఎక్కువగా ఉన్నాయనడానికి ఆమెవద్ద ఎలాంటి సాక్ష్యాలూ లేవు. అవుట్ పేషెంట్ పుస్తకంలో అసలు దీనిపై ఎక్కడా కూడా సమాచారం లేదు.
♦ సిబ్బంది హాజరుపట్టీ మొత్తం వైద్యురాలైన అనితారాణి టేబుల్‌పైనే ఉంటుంది. ఆమె అనుమతిలేనిదే సిబ్బంది హాజరుపట్టికలో సంతకం కూడా పెట్టలేరు.
♦ వివాదం జరిగిన రోజే అనితారాణి ఇచ్చిన ఫిర్యాదుపై పెనుమూరు స్టేషన్‌లో కేసు (క్రైం.నెం.23/2020) నమోదైంది. నిందితులపై 341, 353 సెక్షన్లు, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ, అండ్ సెక్షన్ 3 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కౌంటర్ కేసుగా అనితారాణి వైద్యం చేయలేదని ఇచ్చిన ఫిర్యాదుపై క్రైం.నెం–24/2020 నమోదు కాగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 341, 506, 166బీ కింద కేసు నమోదుచేశారు.
♦ సీఐడీపై నమ్మకం లేదని చెప్పాలంటే ముందుగా అనితారాణి కేసు విచారణలో సీఐడీ చేసిన తప్పిదాలు చూపాలి. విచారణకే సహకరించని వ్యక్తి స్వయం ప్రతిపత్తి దర్యాప్తు సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
♦ ఇక ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న అనితారాణి గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి నారాయణస్వామి ఆయన ఎమ్మెల్యే కావడం, పెనుమూరు ఆయన పరిధిలోకి రావడమనే ఒకే ఒక్క అంశాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వివాదంలో తన ప్రమేయం ఉన్నట్లు ఒక్క సాక్ష్యం చూపినా రాజీనామా చేస్తానంటూ నారాయణస్వామి బహిరంగంగానే సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment