టీడీపీని వదిలేద్దాం... బీజేపీని రక్షించుకుందాం
- అమిత్ షా ముందు నినదించిన పార్టీ బూత్ స్థాయి నేతలు
- తమకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శన
సాక్షి, అమరావతి: టీడీపీని వదిలించుకుందాం... బీజేపీని రక్షించుకుందాం, మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో పార్టీ బూత్ కమిటీ నేతల మహా సమ్మేళనంలో వినిపించిన నినాదాలు, కనిపించిన ప్లకార్డులివీ.. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికేì కొందరు నేతలు టీడీపీతో పొత్తుపై నిరసన వ్యక్తం చేశారు. లీవ్ టీడీపీ(తెలుగుదేశం పార్టీని వదిలించుకుందాం).. సేవ్ బీజేపీ(భారతీయ జనతా పార్టీని రక్షించుకుందాం)... వుయ్ వాంట్ బీజేపీ సీఎం(మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి) అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు నినాదాలు చేశారు. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో వేదికపైకి అమిత్ షా చేరుకున్నాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రసంగించారు.
అనంతరం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రసంగం మొదలు కాగానే సభా వేదిక ముందు ఉన్న బూత్‌స్థాయి నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో ఒక్కసారి కలకలం రేగడంతో సురేశ్ ప్రభు తన ప్రసంగాన్ని కుదించుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేతలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. అమిత్ షా తన పక్కనే ఉన్న నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ నేతలు ప్లకార్డులు ప్రదర్శించే సమయంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూర్చోవాలని చెప్పారు. దీంతో పెద్ద సంఖ్యలో నేతలు లేచి నిలబడి చేతులు అడ్డంగా ఊపుతూ కేకలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు.