వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేసే 12 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ముందుగానే ప్రకటించనుంది.
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేసే 12 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ముందుగానే ప్రకటించనుంది. ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి సమావే శంలో ఇచ్చిన మార్గనిర్దేశనం మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపికను వీలయినంత త్వరగా ముగించనుంది. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలను ఆ పార్టీ మూడు తరగతులుగా విభజించింది. ఏ కేటగిరీ కింద ఇప్పటికే గుర్తించిన 12 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించినట్టు సమాచారం. కాగా ఈ 12 సీట్లు తెలంగాణలోనివే కావడం గమనార్హం. యువకులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం సూచించినందున అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా తయారయింది.
సికింద్రాబాద్ సీటును బండారు దత్తాత్రేయ, భువనగిరి లేదా మల్కాజ్‌గిరి సీటును నల్లు ఇంద్రసేనారెడ్డి ఆశిస్తున్నారు. కరీంనగర్ స్థానాన్ని సీహెచ్ విద్యాసాగరరావుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కోరుతుండడంతో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వయసు రీత్యా దత్తాత్రేయకు టికెట్ నిరాకరిస్తే సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి లేదా కె.లక్ష్మణ్ పోటీకి దిగుతారని తెలిసింది. పార్టీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు మల్కాజ్‌గిరి సీటును కోరుతున్నారు. యెండల లక్ష్మీనారాయణ నిజమాబాద్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ సీటుపై నాగం జనార్దన్‌రెడ్డికి ఇప్పటికే హామీ లభించినట్టు తెలిసింది. నరేంద్రనాథ్ లేదా ఆలె నరేంద్ర కుమారుడు భాస్కర్‌కు మెదక్ టికెట్ లభించే అవకాశం ఉంది. చేవెళ్ల సీటు కోసం బద్దం బాల్‌రెడ్డి పట్టుబడుతున్నారు. టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ అనంతరం సమావేశం జరిపి తొలిజాబితా అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.