
'పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీనే అడిగింది'
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని నెల్లూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని నెల్లూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీనే అడిగిందన్నారు. ఇప్పుడు బీజేపీతో పాటు టీడీపీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు క్షమించరన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలను లేవనెత్తుతామని మేకపాటి తెలిపారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకు వచ్చారన్నారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధీ ఇప్పడు మళ్లీ రాజకీయ లబ్ది కోసమే మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని.. అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కోటి సంతకాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్పై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ చేసే మంచి పనులకు తమ మద్దతు ఉంటుందన్నారు.