కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఓ బీజేపీ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడమే కాకుండా కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
కిరోసిన్ ఒంటిపై పోసుకున్న బీజేపీ నేత
కొత్తపల్లి: కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఓ బీజేపీ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడమే కాకుండా కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి ఊరచెరువు సెంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్న మేడసాని వరలక్ష్మీనారాయణ స్థానికంగా సైకిల్ రిపేరు షాపు నిర్వహిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చడానికి కాలయూపన చేస్తున్నారన్న మనోవేదనకు గురై కిరోసిన్ ఒంటిపై పోసుకొని, కిరోసిన్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తునిలో జరిగిన కాపుగర్జనకు హాజరయ్యానని, ఈ సభకు అధిక సంఖ్యలో కాపు సోదరులంతా తరలి రావడంతో సభను ఏ విధంగానైనా దెబ్బతీయాలనే కుట్రతో తెలుగుదేశం పార్టీ నాయకులే రైలును, పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టారన్నారు. ఈ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, కాపులను బీసీల్లో చేర్చే వరకూ కాపు సోదరులందరూ ప్రాణాలకైనా తెగిస్తామన్నారు. తాను 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, చంద్రబాబులాంటి నాయకుడిని చూడలేదన్నారు. వరలక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై చైతన్యకుమార్‌ను వివరణ కోరగా కేసు నమోదు చేయలేదని, లక్ష్మీనారాయణకు కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యునితో లక్ష్మీనారాయణకు చికిత్స చేరుుంచారు.