
విభజన అంటే గీత గీయడం కాదు
రాష్ట్రాన్ని విడగొట్టడమంటే గీత గీయడం కాదు. సీమాంధ్రకున్యాయం చేయకుండా విభజన విషయంలో బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లద’ని ఆ పార్టీ జాతీయ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
సాక్షి, అనంతపురం: ‘రాష్ట్రాన్ని విడగొట్టడమంటే గీత గీయడం కాదు. సీమాంధ్రకున్యాయం చేయకుండా విభజన విషయంలో బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లద’ని ఆ పార్టీ జాతీయ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘మోడీ ఫర్ పీఎం’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమ తరతరాలుగా కరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విభజన బిల్లులో వాటికి పరిష్కార మార్గాలు చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
‘కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోంది. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కిరణ్ సీడబ్ల్యూసీ సమావేశంలో గట్టిగా ఎందుకు వ్యతిరేకించలేకపోయారు? ఇన్నాళ్లూ పట్టించుకోకుండా మరో 68 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంద’ని దుయ్యబట్టారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వాలని కొందరు నేతలు తమ వద్దకొచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో తాము అంగీకరించలేదన్నారు.
అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపేందుకైనా మద్దతివ్వాలని మరికొందరు కోరారని, అయితే.. సీమను విడదీసి అపఖ్యాతి మూటగట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పదేళ్ల ట్యాక్స్ హాలిడే ఇచ్చారని, ఇదే తరహాలో రాయలసీమలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో అస్థిరత నెలకొందని, స్థిరమైన ప్రభుత్వం రావాలంటే మోడీని ప్రధాని చేయడమే ఏకైక మార్గమని అన్నారు. కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలతో దేశాన్ని సర్వనాశనం చేసింద ని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే అవినీతి పరులను జైలుకు పంపుతామని ఎన్నికల ముందు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... ఇప్పుడు అవినీతి కాంగ్రెస్‌తో చేతులు కలిపి అందలమెక్కారని, అవినీతిపరుల చిట్టా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు.
వెంకయ్యతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న వెంకయ్య నాయుడుని విడివిడిగా కలిసి చర్చలు జరిపారు. విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేస్తుండటంతో సమైక్యంగా వుంచే దిశలో మద్దతు కోరేందుకు వెంకయ్య నాయుడుని కలిశామని సునీత, కే శవ్ వెల్లడించారు. కాగా.. సమైక్యం కోసం మద్దతు కోరేందుకే అయితే కలిసిగా కాకుండా విడివిడిగా ఎందుకు కలిశారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.