రూ. 2.80 లక్షలతో పరారైన మోసగాళ్లు
బాధిత మహిళలు గుంటూరు వాసులు
గోకవరం, న్యూస్‌లైన్ : గోకవరంలో సర్వసాధారణమైన చౌక బంగారం మోసం కేసులు స్థానిక పోలీసు స్టేషన్‌లో యథావిధిగా నమోదవుతున్నాయి. పోలీసులు వీటిని అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయకపోవడంతో మోసగాళ్ల వలలో పడి పలువురు మోసపోతూనే ఉన్నారు. చౌకగా బంగారం విక్రయిస్తామని చెప్పి ఇద్దరు మహిళలను మోసగించిన ఘటన తాజాగా జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నమోదైన ఈ కేసు వివరాలు ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన కోపూరి లక్ష్మి, ఆమె పెదనాన్న కుమార్తె కృష్ణవేణిలకు రాజు అనే వ్యక్తి పరిచయమై తక్కువ మొత్తానికి ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మబలికాడు. అతడి మాట నిజమోకాదో తేల్చుకునేందుకు లక్ష్మి, కృష్ణవేణి ఈనెల 4న గోకవరం వచ్చారు. వీరిని రాజు గోకవరంలోని డ్రైవర్స్‌కాలనీకి తీసుకువెళ్లి ఓ ఇంట్లో బంగారం చూపించాడు. అప్పుడు అతడితోపాటు మరికొందరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఆ మహిళలిద్దరూ గుంటూరు వెళ్లి ఈనెల 6న రూ. 2.80 లక్షలతో తిరిగివచ్చారు. వీరిని డ్రైవర్స్‌కాలనీలో ఆ ఇంటి వద్దకు తీసుకువెళ్లిన కొందరు వ్యక్తులు ముందుగా నగదు తీసుకున్నారు.
బంగారం తెచ్చే సమయానికి ‘పోలీసులు, పోలీసులు.. ’అంటూ కేకలు వేస్తూ అక్కడి నుండి పారిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఇద్దరు మహిళలు గోకవరం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోకవరంలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసగాళ్లెవరో పోలీసులకు తెలిసినా పట్టించుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చౌక బంగారం పేరుతో టోకరా
Published Sat, Feb 8 2014 1:32 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement