గోకవరం: చోరీ చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడికి నిద్ర ముంచుకురావడంతో అదే ఇంట్లో మంచం కింద గురకపెట్టి నిద్రపోయాడు. ఆ శబ్ధానికి మెలకువ వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదుచేసి దొంగను పట్టించిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
► పెట్రోల్ బంక్ నిర్వాహకుడు సత్తి వెంకటరెడ్డి (పొగాకురెడ్డి) శుక్రవారం రాత్రి 10.15 గంటలకు బంక్ కార్యకలాపాలు పూర్తి చేసుకుని నగదు బ్యాగ్‌తో తన ఇంటికి చేరుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా అతని వెనుకే వచ్చిన ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించి మంచం కింద నక్కాడు.
► బంక్‌కు సంబంధించిన లావాదేవీలు చూసుకుంటూ వెంకటరెడ్డి రాత్రి 1 గంట వరకు మెలకువగానే ఉండడంతో ఈలోగా దొంగతనానికి వచ్చిన వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు.
► వెంకటరెడ్డికి తెల్లవారుజామున గురక శబ్ధం రావడంతో మెలకువ వచ్చి మంచం కింద చూడగా.. ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌసులు ధరించిన వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. వెంటనే వెంకటరెడ్డి తన భార్యతో కలిసి గది నుంచి బయటకు వచ్చి, తలుపుకు గడియ పెట్టి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు.
► దొంగ మొహానికున్న ముసుగు తొలగించి చూడగా ఆ వ్యక్తి తనకు బాగా తెలిసిన సోడమిల్లి సూరిబాబు అని గుర్తించి వెంకటరెడ్డి కంగుతిన్నాడు. కాగా, తనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో దొంగతనం చేయాలనుకున్నానని ఆ వ్యక్తి పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు.
చోరీకి వచ్చాడు.. గురకపెట్టి నిద్రపోయాడు!
Published Sun, Sep 13 2020 5:48 AM | Last Updated on Sun, Sep 13 2020 5:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment